ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? రోడ్డు కోసం గుర్రాలపై వెళ్లి వినతి పత్రం
అనకాపల్లి జిల్లాలోని పీవీటీజీ గ్రామాల ప్రజలు రహదారి సౌకర్యం లేక ఎదుర్కొంటున్న కష్టాలపై గుర్రపు స్వారీతో వినూత్న నిరసన తెలిపారు. రహదారి లేకపోవడం వల్ల ఆస్పత్రులకు చేరుకోలేక పలువురు మరణిస్తున్నారు. గర్భిణులు, రోగులను డోలీల్లో మోయాల్సి వస్తుంది. నిత్యావసరాలు కూడా గుర్రాలపైనే తెచ్చుకుంటున్నారు. వెంటనే రహదారి సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. అధికారులు వెంటనే స్పందించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
అనకాపల్లి జిల్లా చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోని పీవీటీజీ గ్రామాల ప్రజలు రోడ్డు సౌకర్యం కోసం వినూత్న నిరసన ప్రదర్శించారు. పశువుల బంద, సామలమ్మ కొండ, సోంపురం బందరులో నివసించే 21 కుటుంబాలకు చెందిన 120 మంది ఆదివాసీలు మూడు కిలోమీటర్ల దూరం గుర్రాలపై సవారీ చేస్తూ, తమ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. తమకు రోడ్డు మార్గం లేకపోవడంతో అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రులకు చేరుకోలేక పలువురు ప్రాణాలుకోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి మార్గం లేక సమయానికి ఆస్పత్రికి చేరలేకపోవడంతో సేదరి వెంకట్రావు, కొర్ర బాబురావు మరణించారని, గర్భిణీ స్త్రీలు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని డోలీల్లో మోసుకెళ్ళాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. కానీ రోడ్డు సౌకర్యం లేదు. దీంతో రహదారి సౌకర్యం కోసం అనకాపల్లి జిల్లా కలెక్టర్ కు పలుమార్లు ఫిర్యాదు చేసామని, రహదారి లేక డోలీ మోతలు తప్పడం లేదని వాపోయారు. రేషన్, బియ్యం, పెన్షన్, నిత్యవసర వస్తువులను కూడా గుర్రాలపైనే తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు తమ సమస్యను గుర్తించి.. పశువులు బంద, జీడుగులోవ, సోంపురం బందరు వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజన నాయకుడు గోవిందరావు, పీవీటిజీ నాయకులు, గ్రామస్థులు డిమాండ్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: