టీఆర్ఎస్‌ పార్టీలో ముసలం తప్పినట్టేనా..!

Unrest in TRS goes with Minister Etela Rajender issue solved by KCR, టీఆర్ఎస్‌ పార్టీలో ముసలం తప్పినట్టేనా..!

మొత్తానికి తెలంగాణలో 18 మంత్రులతో.. మంత్రి వర్గం కొలువుతీరింది. మరో ఆరుగురు మంత్రులతో ఆదివారం.. కేసీఆర్ సమక్షంలో గవర్నర్ సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులుగా.. హరీశ్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఈటెల రాజేందర్ కూడా హాజరయ్యారు.

అసలు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఈటెల వస్తారో.. రారో.. అని ఓ సందేహం ఉండేది. కానీ.. ఆయన రావడంతో.. కొంతమేర ఈ అనుమానం పటాపంచలైంది. కొంత కాలంగా.. మంత్రి ఈటెల కామెంట్స్‌పై తెలంగాణలో రచ్చ రచ్చ జరుగుతోంది. ముందు ఈటెల హాట్ కామెంట్స్.. ఆపై కీలక కేబినెట్ మీటింగ్‌కు వెళ్లకపోవడంపై.. పలు రకాల వార్తలు ఒకేసారి గుప్పుమన్నాయి. ఈటెల పార్టీ మారబోతున్నారని.. ఆయనకు.. బీజేపీ స్నేహ హస్తం చాచిందనే వదంతులు జోరుగా షికారు చేశాయి. ఈటెల కామెంట్స్‌పై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా.. స్పందించారు. కొంతమందికి పదవులు వచ్చాక.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని.. కేటీఆర్.. ఈటెలను ఉద్ధేశించి కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా.. ఈటెల మంత్రి పదవిపై కూడా.. పలు వార్తలు మీడియాల్లో ప్రచురితం అయ్యాయి. ఈటెల పదవి నుంచి తొలగించవచ్చని.. ఆ పదవిని హరీశ్‌కి ఇస్తున్నారని.. మొదట వార్తలు వచ్చినప్పటికీ ఆయనతో పాటు ఎవరికీ.. కేసీఆర్ ఉద్వాసన పలకలేదు.

ఎట్టకేలకు.. ఈటెల.. కేసీఆర్‌ మధ్య కోల్డ్ వార్‌కి తెరపడినట్టే అయింది. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం.. ఈటెలను.. దగ్గరుండి.. కేసీఆర్ గవర్నర్‌కి కూడా పరిచయం చేయడం. వారు కలివిడిగా మాట్లాడుకోవడం చూసి.. మొత్తానికి వీరి మధ్య మళ్లీ సఖ్యత కుదిరిందని స్పష్టమవుతోంది. అటు.. ఈటెల పదవి పోలేదు.. ఇటు హరీశ్‌కి పదవి వచ్చింది. ఈ నేపథ్యంలో.. టీఆర్ఎస్ ‌పార్టీకి ఇప్పట్లో తిరుగుబాటు ముప్పు తప్పినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే.. పార్టీలో అసంతృప్తికి కళ్లెం వేసి గులాబీ బాస్ కేసీఆర్.. తనదైన వ్యూహంతో ముందుకు వెళ్లారని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *