ఉన్నావ్ రేప్ కేసు.. బీజేపీ ఎమ్మెల్యే సెంగార్ పై వేటు

legislator sengar expelled from bjp, ఉన్నావ్ రేప్ కేసు.. బీజేపీ ఎమ్మెల్యే సెంగార్ పై వేటు

ఉన్నావ్ రేప్ కేసు నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ని బీజేపీ బహిష్కరించింది. పైగా అతనిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలు తన బంధువులతో కలిసి ప్రయాణిస్తున్న కారును ట్రక్కుతో ఢీ కొట్టించిన ఘటనలో ఆమె బంధువుల్లో ఇద్దరు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సెంగార్ హస్తం ఉందని బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు సెంగార్ నుంచి పెను ముప్పు పొంచి ఉందని వారు సుప్రీంకోర్టుకు లేఖ కూడా రాశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. సెంగార్ పై ఎందుకు చర్య తీసుకోలేదని ఏడాదికాలంగా బీజేపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అతడిని పార్టీనుంచి సస్పెండ్ చేసినట్టు బీజేపీ నేతలు ఇటీవల పేర్కొన్నారు. కానీ..ఇది కంటి తుడుపుచర్యలా ఉందని, అసలు పార్టీ పరంగా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు పట్టుబడుతూ వస్తున్నాయి. కాగా- యూపీలోని బీజేపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు పరోక్షంగా తప్పు పట్టడంతో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఇరకాటంలో పడింది. సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్.. ఈ కేసులో పోలీసులు, అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి స్టేటస్ రిపోర్టు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు కోర్టుకు రాసిన లేఖ ఆలస్యంగా చేరడంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *