కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. లక్ష్మీ విలాస్ బ్యాంకును డీబీఎస్ ఇండియాలో విలీనానికి ఆమోదం..

కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న లక్ష్మీ విలాస్ బ్యాంకును డీబీఎస్ ఇండియాలో విలీనం చేయడానికి కేంద్ర మంత్రి మండలి ఆమోద ముంద్ర వేసింది.

  • Balaraju Goud
  • Publish Date - 4:55 pm, Wed, 25 November 20

కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న లక్ష్మీ విలాస్ బ్యాంకును డీబీఎస్ ఇండియాలో విలీనం చేయడానికి కేంద్ర మంత్రి మండలి ఆమోద ముంద్ర వేసింది. ఆర్థిక వ్య‌వ‌స్థ ప్ర‌యోజనాల‌ను కాపాడుతూనే బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌ను సురక్షితంగా ఉంచ‌డానికే ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్ విలీనానికి అంగీకారం తెలిపినట్లు కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ అన్నారు. ఇవాళ కేంద్ర మండలి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన జవదేకర్ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.


ఈ విలీనంతో ఇక డిపాజిట‌ర్ల‌కు న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌పై ఎలాంటి పరిమితులు ఉండ‌బోవ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ విలీనంలో భాగంగా ఎల్‌వీబీలోకి డీబీఎస్ ఇండియా రూ. 2,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను డీబీఎస్ ఇండియాలో విలీనం చేయాల‌ని న‌వంబ‌ర్ 17న రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్ర‌తిపాదించింది. బ్యాంక్‌ మ‌రింత సంక్షోభంలోకి వెళ్ల‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వం ఒక నెల రోజుల పాటు మార‌టోరియం విధించింది. అంతేకాకుండా వ్యాపార లావాదేవీలకు సంబంధించి అంక్షలు అమలు చేసింది. అలాగే, నెల‌కు గ‌రిష్ఠంగా రూ.25,000 నగదు మాత్ర‌మే ఉప‌సంహ‌రించుకునే అవ‌కాశం క‌ల్పించింది. ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్ కొంత కాలంగా అప్పులు, పాల‌న స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో లక్ష్మీ విలాస్ బ్యాంకు ఖాతాదారులకు ఊరట లభించింది.