మాంసాహారం తినే మహిళలు వందేళ్లు జీవించే అవకాశం ఉందా?

శాఖాహారం ఆరోగ్యానికి మంచిదని, ఎక్కువ కాలం జీవించేందుకు సహకరిస్తుందని మనం ఇప్పటిదాకా విన్నాం. అయితే చైనాలో మాంసాహారం తినే వృద్ధ మహిళలు శాఖాహారం తీసుకునే మహిళలతో పోలిస్తే ఎక్కువ కాలం దాదాపు వందేళ్లు జీవించారనీ పరిశోధకులు గుర్తించారు. అయితే పురుషుల్లో మాత్రం ఇలాంటి సంబంధాన్ని గుర్తించలేకపోయారు.

మాంసాహారం తినే మహిళలు వందేళ్లు జీవించే అవకాశం ఉందా?
Women Who Eat Meat Have A Higher Chance Of Living Upto Hundred

Updated on: Oct 16, 2026 | 7:05 PM

ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలంటే ఏం తినాలి? కూరగాయలా మాంసాహారమా? ఈ ప్రశ్నలపై ఇప్పటికే అనేక అధ్యయనాలు జరిగాయి. చైనా పరిశోధకులు ఈ అధ్యయనం చేయడంలో 100 ఏళ్లు పూర్తి చేసుకున్న 1,459 మందితో పాటు, 80 నుంచి 90 ఏళ్ల మధ్య వయసున్న 3,744 మందిని పరిశీలించారు. ఈ పరిశోధనలో భాగంగా వృద్ధుల ఆహారపు అలవాట్లు, శరీర బరువు, దీర్ఘాయువు మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించారు. ముఖ్యంగా మాంసాహారం తీసుకునేవారికి, శాఖాహారం తీసుకునేవారికి 100 ఏళ్లు జీవించే అవకాశాల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా అని అధ్యయనం చేశారు. పరిశోధనా వివరాలు The American Journal of Clinical Nutrition పత్రికలో ప్రచురితమయ్యాయి.

వృద్ధ మహిళల్లో బాడీ మాస్ ఇండెక్స్ తక్కువ

ఈ అధ్యయనంలో పరిశోధకులు గుర్తించిన మరో ముఖ్యమైన అంశం బాడీ మాస్ ఇండెక్స్ (BMI). అంటే ఒక వ్యక్తి ఎత్తుకు తగిన శరీర బరువు ఉందా అని తెలుసుకోవడానికి ఉపయోగించే కొలమానం. వృద్ధాప్యంలో చాలామందికి శరీర బరువు తగ్గడం, కండరాల బలం తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో శరీరానికి అవసరమైన పోషకాలు, తగినంత కేలరీలు అందకపోతే ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. తక్కువ బరువు ఉన్న వృద్ధ మహిళల్లో మాంసాహారం ద్వారా అందే ప్రోటీన్, ఇతర పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడటంలో పాత్ర పోషిస్తుంది.

చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు మంచివి!

శాఖాహారుల్లో కొందరు చేపలు, పాలు, గుడ్లు తినేవారికి కూడా మాంసాహారం తీసుకునేవారితో సమానమైన స్థాయిలో 100 ఏళ్లు జీవించే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. శరీరానికి అవసరమైన ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, తగినంత శక్తిని అందించే సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. వృద్ధాప్యంలో కండరాల బలాన్ని కాపాడుకోవడం, పోషకాహార లోపం రాకుండా చూసుకోవడం ఆరోగ్యకరమైన జీవితానికి కీలకమని ఈ అధ్యయనం సూచిస్తోంది.

శాఖాహారం ఆరోగ్యానికి మంచిదని గతంలో అధ్యయనాలు తెలిపాయి. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, టైప్-2 మధుమేహం, ఊబకాయం వంటి సమస్యల ముప్పు తగ్గే అవకాశం ఉంది. అయితే శాఖాహారం తీసుకునేవారు కూడా శరీరానికి అవసరమైన ప్రోటీన్, కేలరీలు, ఇతర పోషకాలు తగినంతగా అందేలా చూసుకోవాలి. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల పోషకాహార లోపం, కండరాల బలహీనత వచ్చే ప్రమాదం ఉంది.

మొత్తంగా చూస్తే.. 100 ఏళ్లు జీవించాలంటే మాంసాహారం తప్పనిసరిగా తినాలన్నది ఈ పరిశోధన ఉద్దేశం కాదు. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరానికి సరిపడా పోషకాలు అందించడం, కండరాల బలాన్ని కాపాడుకోవడం, ఆరోగ్యకరమైన బరువు ఉండటం ముఖ్యమని ఈ అధ్యయనం సూచిస్తోంది. శాఖాహారమైనా, మాంసాహారమైనా సమతుల్య ఆహారం తీసుకోవడమే ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి కీలకం.

Loading...
Unable to load recommendations.
Follow Us