
ఒక పురుషుడికి ఇద్దరు భార్యలు ఉండటం చూసి ఉంటారు కానీ, ఒక మహిళకు ఇద్దరు భర్తలు ఉండటం అనేది చాలా చాలా అరుదు. అయితే వివాహేతర బంధాలు కాకుండా.. అందరి సమ్మతితో ఇద్దరు భర్తలను కలిగి ఉండటం అనేది ప్రస్తుత సమాజంలో పెద్దగా కనిపించని విషయం. కానీ తాజాగా ఓ మహిళ ఇద్దరు సోదరులను పెళ్లాడింది. అది కూడా సాంప్రదాయబద్ధంగా. ఈ వింత వివాహం గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. హిమాచల్ ప్రదేశ్‌లోని షిల్లాయ్ గ్రామంలో హట్టి తెగకు చెందిన ఇద్దరు సోదరులు ఒక మహిళను వివాహం చేసుకున్నారు. బహుభర్తృత్వం అనే సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహాన్ని వందలాది మంది వీక్షించారు. వధువు సునీతా చౌహాన్, వరులు ప్రదీప్, కపిల్ నేగి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
జూలై 12న సిర్మౌర్ జిల్లాలోని ట్రాన్స్-గిరి ప్రాంతంలో ప్రారంభమై మూడు రోజుల పాటు ఈ వివాహ వేడుక కొనసాగింది. వివాహ వేడుకకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ రెవెన్యూ చట్టాలు ఈ సంప్రదాయాన్ని గుర్తించి దానికి “జోడిదారా” అని పేరు పెట్టాయి. ట్రాన్స్-గిరిలోని బధానా గ్రామంలో గత ఆరు సంవత్సరాలలో అలాంటి ఐదు వివాహాలు జరిగాయి. అయితే ఈ పెళ్లిలో ఒక వరుడైన షిల్లై గ్రామానికి చెందిన ప్రదీప్ ప్రభుత్వ శాఖలో పనిచేస్తుండగా, అతని తమ్ముడు మరో వరుడు కపిల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు.
హట్టి అనేది హిమాచల్ ప్రదేశ్-ఉత్తరాఖండ్ సరిహద్దులో ఉన్న ఒక సమాజం. మూడు సంవత్సరాల క్రితం షెడ్యూల్డ్ తెగగా ప్రకటించబడింది. ఈ తెగలో బహుభర్తృత్వం శతాబ్దాలుగా వాడుకలో ఉంది. కానీ మహిళల్లో అక్షరాస్యత పెరగడం, ఈ ప్రాంతంలోని వర్గాల ఆర్థిక పురోగతి కారణంగా బహుభర్తృత్వ వివాహాలు పెద్దగా జరగలేదు. ఇటువంటి వివాహాలు రహస్యంగా జరుగుతాయని, సమాజం వాటిని అంగీకరిస్తుందని, కానీ అలాంటి సందర్భాలు తక్కువగా ఉంటాయని గ్రామంలోని పెద్దలు తెలిపారు. ఈ సంప్రదాయం వెనుక ఉన్న ప్రధాన అంశాలలో ఒకటి పూర్వీకుల భూమి విభజించబడకుండా చూసుకోవడం, పూర్వీకుల ఆస్తిలో గిరిజన మహిళల వాటా ఇప్పటికీ ప్రధాన సమస్యగా ఉండటమే.
సిర్మౌర్ జిల్లాలోని ట్రాన్స్ గిరి ప్రాంతంలోని దాదాపు 450 గ్రామాలలో హట్టి కమ్యూనిటీకి చెందిన దాదాపు మూడు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. కొన్ని గ్రామాలలో బహుభర్తృత్వం ఇప్పటికీ ఆచరించే సంప్రదాయం. ఇది ఉత్తరాఖండ్‌లోని గిరిజన ప్రాంతమైన జౌన్సర్ బాబర్, హిమాచల్ ప్రదేశ్‌లోని గిరిజన జిల్లా కిన్నౌర్‌లో కూడా ప్రబలంగా ఉంది. హట్టి కమ్యూనిటీ ప్రధాన సంస్థ కేంద్రీయ హట్టి సమితి ప్రధాన కార్యదర్శి కుందన్ సింగ్ శాస్త్రి మాట్లాడుతూ.. ఒక కుటుంబం వ్యవసాయ భూమిని మరింత విభజించకుండా కాపాడటానికి వేల సంవత్సరాల క్రితం ఈ సంప్రదాయాన్ని కనుగొన్నారు.
వేర్వేరు తల్లుల నుండి పుట్టిన ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులు ఒకే వధువుతో వివాహం చేసుకోవడం ద్వారా ఉమ్మడి కుటుంబంలో సోదరభావం, పరస్పర అవగాహనను ప్రోత్సహించడం మరొక కారణం అని ఆయన తెలిపారు. మూడవ కారణం భద్రతా భావం.. మీకు పెద్ద కుటుంబం, ఎక్కువ మంది పురుషులు ఉంటే, మీరు గిరిజన సమాజంలో మరింత సురక్షితంగా ఉంటారు అని ఆయన అన్నారు. ఇది దూరప్రాంతాల్లో చెల్లాచెదురుగా ఉన్న వ్యవసాయ భూములను నిర్వహించడంలో కూడా సహాయపడుతుంది. గిరిజన కుటుంబాల ఈ అవసరాలు వేల సంవత్సరాలుగా బహుభర్తృత్వ వ్యవస్థను ఆచరణలో కొనసాగిస్తున్నాయని, అయితే ఈ సంప్రదాయాలు నెమ్మదిగా అంతరించిపోతుందని పేర్కొన్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి