
ప్రస్తుతం రెడిట్ అనే సామాజిక మాధ్యమంలో ఒక పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక యూజర్ “2025లో బిగ్గెస్ట్ దీపావళి సఫాయి” పేరుతో కొన్ని ఫొటోలను పంచుకున్నారు. అందులో రూ. 2,000 నోట్ల కట్టలు పేర్చి ఉన్నాయి. ప్రస్తుతం చలామణిలో లేని ఈ నోట్లను ఏం చేయాలనే దానిపై ఆ యూజర్ ఆన్‌లైన్‌లో సలహా కోరారు.
యూజర్ తెలిపిన వివరాల ప్రకారం, ఆమె తల్లి దీపావళి సందర్భంగా ఇల్లు శుభ్రం చేస్తుండగా, పాత డీటీహెచ్ బాక్స్‌లో దాచి ఉంచిన రూ. 2 లక్షల విలువైన రూ. 2,000 నోట్లు దొరికాయి. పెద్ద నోట్ల రద్దు (Demonetisation) సమయంలో వారి తండ్రి వీటిని దాచి ఉంటారని భావిస్తున్నారు. ఈ విషయం ఇంకా ఆయనకు చెప్పలేదు అని, ఇప్పుడు చలామణిలో లేని ఈ నోట్లను మార్చుకోవడానికి ముందుకు ఎలా సాగాలి? అని ఆ యూజర్ ఆన్‌లైన్‌లో సలహా కోరారు.
ఈ సంఘటన సామాజిక మాధ్యమ యూజర్లను ఆశ్చర్యపరిచింది. చాలామంది ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయగా, మరికొందరు ఈ నోట్లను మార్చుకోవడానికి చట్టపరమైన సలహాలు ఇచ్చారు. కొంతమంది తండ్రికి ఇది ఒక పెద్ద ‘దీపావళి ఆశ్చర్యం’ ఇవ్వనుంది అని పేర్కొన్నారు.
పాత నోట్లను మార్చుకునే విధానంపై చాలామంది ఆచరణాత్మక సలహాలు ఇచ్చారు. ఒక యూజర్ ముఖ్యమైన సూచన చేశారు. కొన్ని స్థానిక పోస్ట్ ఆఫీసులు ఇప్పటికీ పాత రూ. 2,000 నోట్లను స్వీకరిస్తున్నాయి అని వివరించారు. వారు రోజుకు రూ. 20,000 వరకు నోట్లు స్వీకరించి, వాటిని సురక్షిత కొరియర్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కి పంపుతారు అని తెలిపారు. సుమారు పది నెలల క్రితం తాను ఈ పద్ధతిని విజయవంతంగా పాటించాను అని సలహా ఇచ్చారు.