మిణుగురులు ఎందుకు మెరుస్తాయి.. ప్రకృతి దాచిన ఈ రహస్యాలు తెలుసా..?

చుట్టూ చీకటి.. అప్పుడే గాలిలో అప్పుడే మినుకు మినుకుమంటూ మిణుగురుల వెలుగులు.. ఆకాశంలోని నక్షత్రాలన్నీ నేల మీదకు దిగి వచ్చి నాట్యం చేస్తున్నాయా అన్నట్టుగా ఉండే ఈ అద్భుతం వెనుక ఒక సూపర్ సైన్స్ ఉందని మీకు తెలుసా? మిణుగురు పురుగులు కేవలం అందం కోసమే మెరుస్తాయా? లేక వాటి వెలుగు వెనుక ప్రాణరక్షణ రహస్యం ఉందా? అసలు కరెంట్, వేడి లేకుండా ఇవి ఎలా వెలుగుతాయో తెలుసుకుందాం..

మిణుగురులు ఎందుకు మెరుస్తాయి.. ప్రకృతి దాచిన ఈ రహస్యాలు తెలుసా..?
Why Do Fireflies Glow At Night

Updated on: May 15, 2026 | 1:14 PM

నిశబ్ద రాత్రిలో ఆకాశంలో చుక్కలు నేల మీదకు వచ్చాయా అన్నట్లుగా మెరిసే మిణుగురు పురుగులను చూస్తే ఎవరైన ఆశ్చర్యపోతారు. కేవలం అందం మాత్రమే కాదు, ఈ చిరు ప్రాణుల వెనుక లక్షలాది ఏళ్ల పరిణామ క్రమం, అద్భుతమైన రసాయన శాస్త్రం దాగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,200 జాతుల మిణుగురులు ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా. వాటికి ఆ లైటింగ్ ఎలా వచ్చిందనేది చాలా మందిని వెంటాడే క్వశ్చన్. మనం ఇంట్లో వాడే బల్బులు కేవలం 10శాతం కాంతిని ఇచ్చి 90శాతం వేడిని ఉత్పత్తి చేస్తాయి. కానీ మిణుగురు పురుగులు ఉత్పత్తి చేసే కాంతిలో 100శాతం వెలుతురే ఉంటుంది. అసలు వేడి పుట్టదు. అందుకే దీనిని చల్లని కాంతి అంటారు.

ఏమిటీ బయోలుమినిసెన్స్..?

మిణుగురు పురుగులు కాంతిని సృష్టించే ప్రక్రియను శాస్త్రీయంగా బయోలుమినిసెన్స్ అని పిలుస్తారు. అంటే ఒక జీవి తన శరీరంలో జరిగే రసాయన చర్య ద్వారా కాంతిని ఉత్పత్తి చేయడం. మిణుగురు పురుగుల పొత్తికడుపు భాగంలో లూసిఫెరిన్ అనే రసాయనం, లూసిఫెరేస్ అనే ఎంజైమ్ ఉంటాయి. ఈ పురుగు శ్వాస తీసుకున్నప్పుడు, ఆక్సిజన్ నేరుగా ఈ రసాయనాలతో కలుస్తుంది. ఈ చర్య వల్ల శక్తి విడుదలవుతుంది, అదే మనకు కాంతి రూపంలో కనిపిస్తుంది.

రాత్రిపూట మాత్రమే ఎందుకు మెరుస్తాయి?

పగటిపూట సూర్యకాంతిలో ఈ చిన్న మెరుపులు కనిపించవు. అందుకే తమ మనుగడ కోసం ఇవి రాత్రిని ఎంచుకున్నాయి. దీని వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.

నిశబ్దమైన ప్రేమ భాష

మిణుగురుల మెరుపులు వాటి మధ్య జరిగే సంభాషణ. మగ పురుగులు గాలిలో ఎగురుతూ ఒక ప్రత్యేకమైన లయలో కాంతి సంకేతాలను పంపిస్తాయి. నేల మీద ఉండే ఆడ పురుగులు ఆ సంకేతాలను గుర్తించి, తిరిగి స్పందిస్తాయి. ఇలా చీకటిలో తమ భాగస్వామిని వెతుక్కుని పునరుత్పత్తి సాగించడానికి ఈ వెలుగులు ఒక లవ్ సిగ్నల్స్‌లా పనిచేస్తాయి.

ప్రాణరక్షణ కవచం

చీకటిలో మెరవడం వల్ల శత్రువులకు దొరికిపోతాయేమో అని మనకు అనిపిస్తుంది. కానీ ఈ కాంతి వెనుక ఒక హెచ్చరిక ఉంది. మిణుగురుల శరీరంలో లూసిఫుగాసిన్ అనే విషపూరిత రసాయనం ఉంటుంది. మెరుస్తున్న పురుగును తింటే ఆ రుచి అసహ్యంగా ఉండి, వేటాడే జీవులకు హాని కలిగిస్తుంది. అందుకే ‘‘నేను మెరుస్తున్నానంటే.. నన్ను తినొద్దు’’ అని పక్షులు, కప్పలను హెచ్చరించడానికి ఇవి ఈ కాంతిని వాడుతాయి.

మీకు తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,200 జాతుల మిణుగురు పురుగులు ఉన్నాయి. కేవలం పెద్ద పురుగులే కాదు, వీటి గుడ్లు, లార్వాలు కూడా కాంతిని వెదజల్లుతాయి. మన దేశంలోని నెల్లియంపతి, టోప్‌చిలిప్ వంటి అటవీ ప్రాంతాల్లో వర్షాకాలం తర్వాత లక్షలాది మిణుగురులు ఒకేసారి మెరిసి వింత లోకాన్ని ఆవిష్కరిస్తాయి. ప్రకృతి అందించిన ఈ సహజమైన LED వ్యవస్థ నేడు పెరుగుతున్న కాంతి కాలుష్యం వల్ల కనుమరుగవుతోంది. రాత్రివేళల్లో మనం వాడే మితిమీరిన కృత్రిమ వెలుతురు వల్ల ఇవి తమ భాగస్వామిని చేరుకోలేక అంతరించిపోతున్నాయి. ఈ అద్భుత జీవకళను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

Follow Us