ఇంత చిన్న మౌస్‌ వెనక అంత పెద్ద కథ ఉందా.. అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

ఆధునిక కంప్యూటింగ్ విప్లవంలో మౌస్ పాత్ర అనన్యసామాన్యం. చేతిలో మౌస్ లేనిదే కంప్యూటర్‌పై ఎలాంటి పనినైనా వేగంగా చేయడం దాదాపు అసాధ్యం. అయితే నేడు ఎంతో స్టైలిష్‌గా కనిపించే ఈ పరికరం.. ప్రారంభంలో ఒక చిన్న చెక్క పెట్టెలా, రెండు చక్రాలతో ఉండేదన్న విషయం చాలా మందికి తెలియదు. అసలు ఇది మన చేతికి ఎలా వచ్చిందో తెలుసుకుందాం..

ఇంత చిన్న మౌస్‌ వెనక అంత పెద్ద కథ ఉందా.. అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
Who Invented The Computer Mouse

Updated on: Jun 22, 2026 | 9:51 PM

ఈ రోజుల్లో కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ముందు కూర్చుంటే చాలు.. మన చేయి ఆటోమేటిక్‌గా మౌస్ మీదికి వెళ్ళిపోతుంది. స్క్రీన్‌పై ఫైల్స్ ఓపెన్ చేయాలన్నా, గేమ్స్ ఆడాలన్నా, వేగంగా బ్రౌజ్ చేయాలన్నా ఈ చిన్న పరికరం లేకపోతే డిజిటల్ ప్రపంచం స్తంభించిపోతుంది. నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చేతుల్లో అలవోకగా కదులుతున్న ఈ ప్లాస్టిక్ మౌస్.. ఒకప్పుడు కేవలం ఒక చెక్క పెట్టె అంటే మీరు నమ్ముతారా? చాలా మందికి దీన్ని చరిత్ర తెలియదు. మనం ప్రతిరోజూ వాడే కంప్యూటర్ మౌస్‌ను 1964లో డగ్లస్ ఎంగెల్‌బార్ట్ అనే అమెరికన్ ఇంజనీర్ కనుగొన్నారు. ఆ సమయంలో ఆయన కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసేవారు. కంప్యూటర్ వాడకాన్ని సామాన్యులకు సైతం సులభతరం చేయాలనే ఒక గొప్ప ఆలోచనతో ఆయన ఈ పరికరానికి ప్రాణం పోశారు. డగ్లస్ ఆలోచనకు రూపమిస్తూ.. ఆ సంస్థలోనే చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న బిల్ ఇంగ్లీష్ 1964లో మొట్టమొదటి పనిచేసే మౌస్ నమూనాను తయారు చేశారు. వీరిద్దరి కృషే నేటి ఆధునిక కంప్యూటింగ్ విప్లవానికి పునాది వేసింది.

మొదటి మౌస్.. ఒక చిన్న చెక్క పెట్టె

ప్రస్తుతం మనం వాడుతున్న మౌస్‌లు ఎంతో స్టైలిష్‌గా, ప్లాస్టిక్‌తో రకరకాల లైట్లతో మెరిసిపోతుంటాయి. కానీ 1964లో కనుగొన్న మొదటి మౌస్ పూర్తిగా భిన్నమైనది. అది కేవలం ఒక చిన్న చెక్క పెట్టె ఆకారంలో ఉండేది. దాని అడుగు భాగంలో రెండు చిన్న చక్రాలు నిలువుగా, అడ్డంగా అమర్చబడి ఉండేవి. డెస్క్ మీద ఆ చెక్క పెట్టెను కదిపినప్పుడు ఆ చక్రాలు తిరుగుతూ, ఆ కదలికల సమాచారాన్ని కంప్యూటర్‌కు పంపేవి. తద్వారా స్క్రీన్‌పై పాయింటర్ కదిలేది. అప్పట్లో ఇదొక అద్భుత సాంకేతిక మ్యాజిక్.

మౌస్ అనే పేరు ఎలా వచ్చింది?

ఈ పరికరానికి డగ్లస్ ఎంగెల్‌బార్ట్ అధికారికంగా పెట్టిన పేరు ‘‘డిస్‌ప్లే సిస్టమ్ కోసం XY పొజిషన్ ఇండికేటర్’’ . ఆయన జూన్ 27, 1967న ఈ పేరుతోనే పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకోగా 1970 నవంబర్ 17న యు.ఎస్. పేటెంట్ ఆఫీస్ దీనికి పేటెంట్ నంబర్ 3,541,541 మంజూరు చేసింది. అయితే ల్యాబొరేటరీలో పరిశోధనలు జరుగుతున్న సమయంలో ఆ చిన్న చెక్క పరికరం చూడటానికి సరిగ్గా ఒక చిన్న ఎలుకలా, దాని వెనుక నుండి వచ్చే వైర్ ఎలుక తోకలా కనిపించేది. దీంతో ప్రయోగశాల సిబ్బంది సరదాగా దానిని మౌస్ అని పిలవడం ప్రారంభించారు. కాలక్రమేణా ఆ సరదా పేరే ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిపోయింది.

1968 డిసెంబర్ 9న శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఫాల్ జాయింట్ కంప్యూటర్ కాన్ఫరెన్స్‌లో డగ్లస్ ఎంగెల్‌బార్ట్ ఈ మౌస్‌ను మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేస్తూ 90 నిమిషాల పాటు లైవ్ డెమో ఇచ్చారు. కేవలం మౌస్ మాత్రమే కాదు.. నేడు మనం వాడుతున్న వీడియో కాన్ఫరెన్సింగ్, హైపర్‌టెక్స్ట్, స్క్రీన్ విండోస్, నెట్‌వర్క్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీలను ఆ రోజే ఆయన ప్రపంచానికి చూపించి షాక్ ఇచ్చారు. అందుకే ఈ ప్రదర్శనను టెక్ చరిత్రలో ‘‘ది మదర్ ఆఫ్ ఆల్ డెమోస్’’ అని పిలుస్తారు.

ఆపిల్ చేతికి చిక్కి.. ప్రతి ఇంటికీ చేరి..

మౌస్ కనుగొన్న వెంటనే అది మార్కెట్లోకి రాలేదు. చాలా ఏళ్ల పాటు ల్యాబ్‌లకే పరిమితమైంది. ఆ తర్వాత జిరాక్స్ సంస్థ దీనిని వాడగా.. అసలైన విప్లవం 1984లో వచ్చింది. ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ ఆపిల్ తన పర్సనల్ కంప్యూటర్లలో మౌస్‌ను చేర్చడంతో ఇది సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుండి ఇళ్లు, ఆఫీసులు, విద్యాసంస్థల్లో కంప్యూటర్ వాడకంలో మౌస్ ఒక అనివార్య భాగమైపోయింది.

రాడార్ టెక్నీషియన్ టు ట్యూరింగ్ అవార్డు విజేత..

ఈ అద్భుతాన్ని సృష్టించిన డగ్లస్ కార్ల్ ఎంగెల్‌బార్ట్ జనవరి 30, 1925న ఒరెగాన్‌లో జన్మించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యు.ఎస్. నేవీలో రాడార్ టెక్నీషియన్‌గా పనిచేసినప్పుడే ఆయనకు ఎలక్ట్రానిక్ డిస్‌ప్లేలపై ఆసక్తి ఏర్పడింది. ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డాక్టరేట్ పూర్తి చేసి, తన కెరీర్‌లో 21 పేటెంట్లను సాధించారు. కంప్యూటర్ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను 1997లో కంప్యూటర్ సైన్స్‌లోనే అత్యున్నత పురస్కారమైన ఏ.ఎం.ట్యూరింగ్ అవార్డు లభించింది. ఆయన జూలై 2, 2013న తన 88వ ఏట కాలిఫోర్నియాలో కన్నుమూశారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన సృష్టించిన ఈ చిన్న మౌస్ నేటికీ ప్రపంచాన్ని నడిపిస్తూనే ఉంది.

Follow Us