
ఆకలితో ఉన్న ఓ ఏనుగు సూపర్ మార్కెట్‌లోకి దూసుకొచ్చిన సంఘటన థాయ్‌లాండ్‌లో జరిగింది. పైగా అది ఎవరినీ ఏమీ అనకుండా సూపర్ మార్కెట్‌ను కూడా ఏమీ చేయకుండా దానికి ఏం కావాలో అది తినేసి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నఖోన్ రాట్చసీమా ప్రావిన్సులో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు సూపుర్ మార్కెట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఖనో జాతీయ పార్క్‌కు దగ్గర్లో ఓ సూపర్ మార్కెట్ ఉంది. ఈ నేషనల్ పార్క్‌లో అడవి ఏనుగులు ఎక్కువగా ఉంటాయి. వాటిల్లో కొన్ని అడవి నుంచి బయటికొచ్చి తిరుగుతుంటాయి. అలా తిరిగే ఏనుగుల్లో 27 ఏళ్ల మగ ఏనుగు బియాంగ్ లేక్ కూడా ఉంది. ఈ ఏనుగు తరచూ అదే ప్రాంతంలో సంచరిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరినీ ఏమీ అనలేదు. అయితే జూన్ రెండో తేదీన ఈ ఏనుగు హఠాత్తుగా సూపర్‌మార్కెట్లోకి దూరింది. ఆ సమయంలో అక్కడే కౌంటర్ వద్ద ఉన్న మహిళా యజమాని భయంతో పరుగులు పెట్టింది.
సాధారణంగా అడవి మదపుటేనుగులు ఆవేశంతో ఉంటాయి. వాటికి ఆగ్రహం వస్తే సమీప ప్రాంతాలను క్షణాల్లో ధ్వసం చేస్తాయి. కానీ బియాంగ్‌లేక్ ఏనుగు మాత్రం ఎంతో ప్రశాంతంగా మిఠాయిలను మాత్రమే తింటూ కనిపించింది. ఎదురుగా ఎన్నో రకాల తినుబండారాలు కనిపిస్తున్నా ఫ్రిడ్జ్‌ను పక్కకు తోసేసి మరీ స్వీట్లు ఉన్న చోటుకు వెళ్లి నెమ్మదిగా ఒక్కో స్వీట్ ప్యాకెట్‌ను తినేసింది. ఆ తర్వాత అరటి పళ్లను ఆరగించింది. ఆ తర్వాత వేరునెనగ పట్టీలను నములుకుంటూ వెళ్లిపోయింది.
ఏనుగు తన దుకాణం ముందు నుంచి చాలా సార్లు వెళ్లిందనీ కానీ ఎప్పుడూ ఇలా ‘షాపింగ్’చేయలేదని దుకాణం యజమానురాలు బియాంగ్ లేక్ చెప్పారు. ఏనుగు షాపింగ్ చేసి బిల్లు చెల్లించకుండా వెళ్లిందని తెలిసి వన్యప్రాణి సంరక్షణ ప్రతినిధులు తనకు 800 థాయ్ బాత్‌లను చెల్లించారని ఆమె నవ్వుతూ చెప్పారు.
An elephant walked into a grocery store in Thailand and raided the shelves for food 😭 pic.twitter.com/dg2Wo0R38V
— FearBuck (@FearedBuck) June 4, 2025