Trending: మాములుగా పెట్ డాగ్స్ ఎప్పుడూ యజమానిని అంటి పెట్టుకునే ఉంటాయి. ఒకవేళ యజమాని ఇంట్లో లేకపోతే అతను వచ్చేవరకు అలా ఎదురుచూస్తేనే ఉంటాయి. అలాంటిది ఓ వ్యక్తికి చెందిన 2 పెంపుడు కుక్కలు అదృశ్యం అయ్యాయి. గంటలపాటు వెతికినా వాటి ఆచూకి కనిపించలేదు. దీంతో ఆ ఓనర్ ఆందోళన చెందాడు. ఈ క్రమంలోనే గ్రామంలోనే ఓ మరుగు ప్రాంతంలో పాత కాంక్రీట్ స్తంభాలపై పాకుతూ భారీ కొండచిలువ ఓ వ్యక్తికి కనిపించింది. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పాడు. అందరూ వచ్చి చెక్ చేయగా.. ఆ పైథాన్ అస్సలు కదల్లేకపోతుంది. పొట్ట భారీగా ఉబ్బి ఉంది. అప్పుడు అర్థం అయ్యింది.. ఆ కొండచిలువ పెట్ డాగ్స్‌ను ఆహారంగా తీసుకుందని. దీంతో ఆ ఓనర్ తల్లిడిల్లిపోయాడు. ఈ ఘటన ఈశాన్య థాయ్‌లాండ్(north eastern Thailand)లోని సిసాకేట్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఇది ఇప్పటివరకు తాము చూసిన పాములలో అతి పెద్దదని ఒక స్థానికుడు తెలిపాడు. కొండచిలువ ఆ బంజరు భూమిలో మాటు వేసి.. కొంతకాలంగా గ్రామంలోని జంతువులను మింగేస్తుందని అతను అభిప్రాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో యానిమల్ రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని.. దాన్ని బంధించి పునరావాస కేంద్రానికి తరలించారు. ప్రపంచంలోనే అతి పొడవైన పాముగా పరిగణించబడే రెటిక్యులేటెడ్ పైథాన్‌తో సహా అనేక పైథాన్ జాతులు థాయ్‌లాండ్‌లో నివసిస్తున్నాయి. 2021లో కూడా చోన్ బురి ప్రావిన్స్‌లోని ఒక రైతు 20 అడుగుల పొడవున్న భారీ కొండచిలువను చూశాడు. ఆ భారీ పామును బంధించేందుకు దాదాపు 8 మంది రంగంలోకి దిగాల్సి వచ్చింది.
(Source)
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి