
ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఎలా అంత్యక్రియలు జరుగుతాయి.. అసలు కుటుంబ సభ్యులు స్నేహితులు ఇరుగుపొరుగు ఎలా రియాక్ట్ అవుతారు? ఏడుస్తారా లేదా తానే స్వయంగా తెలుసుకోవాలనుకున్నాడు ఒక పెద్దమనిది. అందుకనే తాను బతికుండగానే తన అంతిమ సంస్కారాలను స్వయంగా ఏర్పాటు చేసుకున్నాడు. నా చావుకు రండి అంటూ అందరికీ ఆహ్వానం కూడా పంపాడు. ఈ వింత కోరికతో ప్రస్తుతం నెట్టింట్లో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాడు. ఈ వింత కోరిక కోరుకున్న వ్యక్తి ఆషామాషీ వ్యక్తీ ఏమి కాదు.. దేశ సేవ చేసి విశ్రాంతి తీసుకున్న వ్యక్తీ.. అంతేకాదు మంచి సామజిక కార్యకర్త కూడా. గయా జిల్లాలోని కొంచి గ్రామంలో ఈ ఘటన జరిగింది.
మోహన్‌లాల్ భారత వైమానిక దళంలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన వయస్సు ఇప్పుడు 74 ఏళ్లు. ఆ వ్యక్తికి విచిత్రమైన కోరిక కలిగింది. తాను చనిపోతే తన అంత్యక్రియలకు ఎందరు హాజరవుతారు.. తనను ఎలా గౌరవిస్తారు..తనకోసం ఎంతమంది దుఃఖిస్తారు, అసలు తనకు అంతిమసంస్కారాలు ఎలా నిర్వహిస్తారో చూడాలనుకున్నాడు. అంతే వెంటనే తన కోరికను అమలు పరిచాడు. తను బ్రతికుండగానే అంతిమ సంస్కారాలు నిర్వహించుకోవాలనుకుంటున్నానని, బంధుమిత్రులందరికీ తన చివరి ప్రయాణానికి రావాలని ఆహ్వానం పంపాడు.
చనిపోయినవారికి కప్పినట్టుగానే తెల్లటి దుస్తులు వేసి, పాడెపై పడుకోబెట్టి, పూలదండలు వేశారు. డాన్సులు, నినాదాలు చేస్తూ అతన్ని ముక్తిధామానికి తీసుకు వెళ్లి చితిపై పడుకోబెట్టారు. ఆ తర్వాత అతని స్థానంలో దిష్టిబొమ్మను ఉంచి దహనం చేశారు. బంధువులంతా కన్నీరు మున్నీరుగా విలపించారు. దహనం పూర్తయ్యాక ఆ బూడిదను నదిలో నిమర్జనం చేశారు. అంతిమ సంస్కారాల తర్వాత చేయాల్సిన నియమాలన్నీ పాటించారు. దీంతో తృప్తిపొందిన మోహన్ లాల్.. ఆ తర్వాత వచ్చిన జనాలందరకీ భోజనాలు పెట్టించాడు. ఈ ఘటన నెట్టింట వైరల్ కావడంతో అటు స్థానికులను, ఇటు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది.
వైమానిక దళం నుండి పదవీ విరమణ చేసిన తర్వాత సమాజానికి సేవ చేయాలనుకున్న మోహన్ లాల్ తమ గ్రామంలో వర్షాకాలంలో మృతదేహాలను దహనం చేయడంలో చాలా ఇబ్బందులు పడుతుండడం చూశాడు. ఇది చూసిన తర్వాత అతనికి ముక్తిధామ్(శ్మశానవాటిక) నిర్మించాలనే కోరిక కలిగింది. దీంతో సొంత ఖర్చులతో ముక్తిధామ్ నిర్మించాడు. దాని ప్రారంభోత్సవం సందర్భంగా తన సొంత అంత్యక్రియల నిర్వహించుకున్నాడు.
కుమారులు వైద్యులు, ఉపాధ్యాయులు
మోహన్ లాల్ కు ఇద్దరు కుమారులు. ఒకరు కలకత్తాలో డాక్టర్, మరొకరు 10+2 పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు. అతనికి ఒక కూతురు ఉంది, ఆమె ధన్ బాద్ లో నివసిస్తుంది. మోహన్ లాల్ భార్య జీవన్ జ్యోతి 14ఏళ్ల క్రితమే కాలం చేసినట్టు సమాచారం.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..