
ఫోటోలు లేదా సెల్ఫీలు దిగేటప్పుడు రెండు వేళ్లు చూపిస్తూ విక్టరీ లేదా పీస్ సైన్ (Victory Sign) పెట్టడం మనకు అలవాటే. అయితే, ఈ చిన్న అలవాటు మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత సాయంతో హ్యాకర్లు మీరు సోషల్ మీడియాలో పెట్టే హై-క్వాలిటీ ఫోటోల నుండి మీ వేలిముద్రలను (Fingerprints) సులభంగా దొంగిలిస్తున్నారు. ఈ వేలిముద్రల ఆధారంగా మీ ఫోన్ బయోమెట్రిక్ లాక్‌లను అన్‌లాక్ చేయడంతో పాటు ఆధార్ ఆధారిత చెల్లింపులు, బ్యాంకింగ్ యాప్‌లను హ్యాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఫోటోలు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అవసరం.
ఏఐ (AI) ద్వారా వేలిముద్రల చోరీ:
ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న స్మార్ట్‌ఫోన్లలో కెమెరాల నాణ్యత (Resolution) చాలా ఎక్కువగా ఉంటోంది. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ విపరీతంగా అభివృద్ధి చెందాయి. హ్యాకర్లు ఇప్పుడు ఈ టెక్నాలజీని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. మీరు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసే హై-రిజల్యూషన్ ఫోటోలను ఏఐ సాఫ్ట్‌వేర్ల సాయంతో జూమ్ చేసి, మీ వేళ్లపై ఉండే రేఖలను (Friction Ridges) స్క్యాన్ చేస్తున్నారు. తద్వారా మీ వేలిముద్రల (Fingerprints) యొక్క ఖచ్చితమైన క్లోనింగ్ లేదా త్రీడీ (3D) ప్రింట్‌ను వారు సిద్ధం చేసుకోగలుగుతున్నారు.
జరిగే నష్టం ఏమిటి?:
ఈ రోజుల్లో మన డిజిటల్ జీవితమంతా బయోమెట్రిక్ డేటాపైనే ఆధారపడి ఉంది. ఫోన్ లాక్ స్క్రీన్ నుండి మొదలుకొని బ్యాంకింగ్ యాప్స్, యూపీఐ (UPI) పేమెంట్స్, ఆఫీస్ అటెండెన్స్ మరియు ఆధార్ కార్డ్ లింక్డ్ పేమెంట్ సిస్టమ్ (AEPS) వరకు అన్నింటికీ వేలిముద్రలనే కీలకంగా వాడుతున్నాం. హ్యాకర్లు మీ ఫోటోల ద్వారా సేకరించిన వేలిముద్రలను ఉపయోగించి మీ వ్యక్తిగత డేటాను దొంగిలించడమే కాకుండా, మీ బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మును కూడా స్వాహా చేసే ప్రమాదం ఉంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
కెమెరాకు చాలా దగ్గరగా చేతులను చూపిస్తూ ఫోటోలు దిగడం ముప్పే. ఒకవేళ విక్టరీ సైన్ పెట్టాలనుకుంటే కెమెరాకు కనీసం 3 మీటర్ల దూరంలో ఉండాలి.
సోషల్ మీడియాలో ఫోటోలను అప్‌లోడ్ చేసే ముందు ప్రైవసీ సెట్టింగ్స్ చెక్ చేసుకోవాలి. మీ ఫోటోలు కేవలం స్నేహితులకు మాత్రమే కనిపించేలా చూసుకోవడం మంచిది.
బయోమెట్రిక్ లాక్‌లతో పాటు అదనపు భద్రత కోసం బలమైన పిన్ (PIN), పాస్‌వర్డ్ లేదా ఫేస్ ఐడి (Face ID) వంటి టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను ఆన్ చేసి పెట్టుకోవాలి. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ మన జాగ్రత్తలు కూడా మారకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..