
ఈ సోషల్ మీడియా యుగంలో అడవుల్లో జరిగే అరుదైన, ఆసక్తికరమైన జంతువుల వీడియోలు నెట్టింట నిత్యం వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో భారతశ జాతీయ జంతువు, జాతీయ పక్షికి సంబంధించిన ఒక అత్యంత అరుదైన దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. భారత జాతీయ పక్షి అయిన నెమలిని, జాతీయ జంతువైన రాయల్ బెంగాల్ టైగర్ వేటాడిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. మన దేశంలో నెమలి, పెద్దపులి రెండూ వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అత్యంత కఠినమైన రక్షణలో ఉన్న జీవులు. మనుషులు వీటిని వేటాడటం చట్టరీత్యా నేరం. అయితే నడిచే అడవిలో మాత్రం ఏ చట్టాలు వర్తించవు. అక్కడ నడిచేది కేవలం మనుగడ పోరాటం మాత్రమే. ఆహార గొలుసులో అగ్రస్థానంలో ఉండే పులికి ఆకలి వేస్తే ఏదీ మినహాయింపు కాదని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.
వైరల్ అవుతున్న ఆ క్లిప్‌లో.. పెద్దపులి నెమలిని తన దవడలతో గట్టిగా నోట కరుచుకుని దట్టమైన అటవీ మార్గంలో దర్జాగా నడుచుకుంటూ వెళ్తుంది. జాతీయ గుర్తింపు పొందిన రెండు విశిష్ట ప్రాణులు ఇలా వేటగాడు, ఆహారంగా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అత్యంత అరుదైన సంఘటనగా నిలిచింది.
ఈ అద్భుతమైన వైల్డ్‌లైఫ్ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ‘‘ప్రకృతి నియమాలు ఎవరికీ తలవంచవు.. జాతీయ పక్షి అయినా, పులికి అది ఆహారమే’’ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. అడవి సహజత్వాన్ని ప్రతిబింబించే ఈ అరుదైన వీడియో ప్రస్తుతం వివిధ సోషల్ మీడియా వేదికల్లో ట్రెండింగ్‌గా మారింది.