పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన బడి పంతులు..భరించలేని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఎంతో ఓపిక సహనంతో ఉండాల్సిన టీచర్లు, పిల్లలు చేసే చిన్నచిన్న తప్పిదాలకే రెచ్చిపోతున్నారు. వారిపట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. క్రమశిక్షణ పేరుతో చిన్న, చిన్న కారణాలకే దారుణంగా దండిస్తున్నారు. రోజూ ఏదో ఒక మూలన ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇద్దరు పిల్లలను ఇనుపగొలుసులతో కట్టేశాడు ఓ ఉపాధ్యాయుడు. వారద్దరిని చిత్ర హింసలకు గురి చేశాడు. ఇనుప గొలుసులతో కట్టిపడేసి, దానికి తాళం వేశాడు. ఎలాగోలా అక్కడ్నుంచి తప్పించుకున్న ఆ చిన్నారులు..తల్లిదండ్రులను ఆశ్రయించి విషయం తెలియజేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఉత్తరప్రదేశ్ లక్నోలోని గోసైంగంజ్ శివలార్‌లో ఉన్న సుఫమ్‌దింతుల్ ఉలమా మదర్సాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి చదువుకునేందుకు వచ్చిన ఇద్దరు విద్యార్థుల కాళ్లకు ఇనుప గొలుసులు కట్టారు. అయితే వారిద్దరు మదర్సా నుంచి ఎలాగోలా తప్పించుకొని వారి గ్రామానికి చేరుకున్నారు. పిల్లల కాళ్లకు గొలుసులు పడి ఉండడం చూసి గ్రామస్తులు వారిని ఆపారు. మదర్సా ఉపాధ్యాయులు తమను ఇష్టం వచ్చినట్టుగా చితకొట్టారని, కాళ్లను గొలుసుతో కట్టేశారని విద్యార్థులు ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇంటర్‌నెట్‌లో వైరల్ గా మారింది. దీంతో ఈ ఘటన బయటకు వచ్చింది. అయితే ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసుకు ఫిర్యాదు చేయలేదని సమాచారం.. పైగా ఆ మౌలానాపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు.