
సాధారణంగా రెస్టారెంట్‌కు వెళ్తే టేబుళ్లు, కుర్చీలు, ప్లేట్లలో ఆహారం కనిపిస్తాయి. కానీ తైవాన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్తే సీన్ పూర్తిగా మారిపోతుంది. అక్కడ టాయిలెట్ సీట్లపై కూర్చోవాలి.. టాయిలెట్ బౌల్స్‌లో వడ్డించిన ఆహారాన్ని తినాలి.. యూరినల్స్ ఆకారంలో ఉన్న పాత్రల్లో డ్రింక్స్ తాగాలి. వినడానికి కాస్త అసహ్యంగా అనిపించినా.. ఈ వింత అనుభవాన్ని ఆస్వాదించడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా భారతీయ కంటెంట్ క్రియేటర్ ఆకాంక్ష మోంగా ఈ రెస్టారెంట్‌ను సందర్శించి, తన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
ప్రపంచంలో ఎన్నో రకాల థీమ్ రెస్టారెంట్లు ఉంటాయి. కానీ తైవాన్‌లోని ఈ రెస్టారెంట్ అన్నిటి కంటే భిన్నం. ఇక్కడ రెస్టారెంట్ మొత్తం టాయిలెట్ థీమ్‌తో రూపొందించారు. టేబుళ్లపై మలాన్ని పోలిన అలంకరణలు కనిపిస్తాయి. కస్టమర్లు సాధారణ కుర్చీలకు బదులుగా టాయిలెట్ సీట్లపై కూర్చుంటారు. ఇక ఆహారం వడ్డించే విధానం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. సాధారణ ప్లేట్లకు బదులుగా చిన్న టాయిలెట్ బౌల్స్‌లో ఫుడ్ అందిస్తారు. పానీయాలను యూరినల్స్ ఆకారంలో ఉన్న ప్రత్యేక పాత్రల్లో వడ్డిస్తారు. మెనూలో టాయిలెట్ హాట్ పాట్స్‌తో పాటు ‘పూప్ కర్రీస్’ వంటి వింత పేర్లతో వంటకాలు ఉన్నాయని ఆకాంక్ష తన వీడియోలో వివరించారు.
ఈ రెస్టారెంట్లోకి అడుగుపెట్టిన ఆకాంక్ష.. అక్కడి వాతావరణాన్ని, ఆహారాన్ని చూసి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత అసహ్యంగా అనిపించే రెస్టారెంట్లో భోజనం చేయడానికి ఎవరైనా ధైర్యం చేస్తారా? అంటూ తన వీడియోను ప్రారంభించారు.
ఈ రెస్టారెంట్‌లోని ఆహారం విషయంలో ఆకాంక్ష మోంగా పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఫుడ్‌కు 10కి 5 మార్కులు ఇచ్చారు. అక్కడ లభించే వింత అనుభవానికి మాత్రం 10కి 10 మార్కులు కేటాయించారు. అంటే ఆహారం కంటే రెస్టారెంట్ కాన్సెప్ట్నే ఆమె ఎక్కువగా ఆస్వాదించారు. ఆమె దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించిన మరో పదార్థం చాక్లెట్ సాఫ్ట్ సర్వ్ ఐస్‌క్రీమ్. ఇది చూడటానికి నిజమైన మలంలా కనిపించడంతో ఆమె ఆశ్చర్యపోయారు. ఇకపై డార్క్ చాక్లెట్ ఐస్‌క్రీమ్‌ను చూసినా తనకు ఈ రెస్టారెంట్ గుర్తుకు వస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు.
తొలుత చిన్న కాగితపు స్క్వాట్ టాయిలెట్లపై చాక్లెట్ ఐస్‌క్రీమ్ విక్రయించడంతో ఈ కాన్సెప్ట్ ప్రారంభమైందని తెలిపారు. ఆ తర్వాత ఈ ఆలోచన క్రమంగా విస్తరించి, తైవాన్ వ్యాప్తంగా 19 బ్రాంచ్‌లకు చేరుకుందని తెలిపారు. ప్రస్తుతం కేవలం రెండు బ్రాంచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయని తన పోస్టులో వివరించారు. వారాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని, వెళ్లాలనుకునేవారు ముందుగానే బుకింగ్ చేసుకోవడం మంచిదని సూచించారు.
సాధారణంగా టాయిలెట్‌ను చూస్తేనే చాలా మంది అసౌకర్యంగా భావిస్తారు. అలాంటిది అదే ఆకారంలో ఉన్న పాత్రల్లో ఆహారం తినడం, పానీయాలు తాగడం అంటే కొందరికి వింతగా, మరికొందరికి సరదాగా అనిపించవచ్చు. ఇదే ఈ రెస్టారెంట్ ప్రత్యేకత. ఆకాంక్ష మోంగా పంచుకున్న వీడియోతో ఈ వింత రెస్టారెంట్ సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. చివరగా ఆమె తన ఫాలోవర్లను ఓ ప్రశ్న అడిగారు. ‘మరి చెప్పండి.. మీరు ఇక్కడ భోజనం చేయడానికి ధైర్యం చేస్తారా?’ అంటూ నెటిజన్ల అభిప్రాయాలను కోరారు.