
ఇప్పుడు ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వైద్యం నుంచి విద్య వరకు, వ్యాపారం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు ఎన్నో రంగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఇదే సాంకేతికత భవిష్యత్తులో మానవాళికి ముప్పుగా మారే అవకాశం ఉందని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కూడా ఒకరు.
ఏఐలో అత్యంత కీలకమైన అంశం దాని అభివృద్ధి వేగం. మనుషులు జీవ పరిణామం ద్వారా మార్పు చెందడానికి వేలాది, లక్షలాది సంవత్సరాలు పట్టవచ్చు. కానీ అత్యంత అధునాతన ఏఐ వ్యవస్థలు తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకునే స్థాయికి చేరితే, వాటి అభివృద్ధి వేగం మనుషుల సామర్థ్యాన్ని మించిపోవచ్చని హాకింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా, ఒక ఏఐ వ్యవస్థ తనను తాను తిరిగి రూపొందించుకోవడం, మెరుగుపరుచుకోవడం వంటి సామర్థ్యాలను సాధిస్తే.. దాని అభివృద్ధి వేగం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మనుషులు దాని వేగానికి సరితూగగలరా? దానిపై తగిన నియంత్రణ సాధించగలరా? అన్న ప్రశ్నలు ఎదురవుతాయి.
ఏఐ గురించి చాలా మందికి వచ్చే ఆలోచన.. రోబోలు మనుషులపై తిరగబడతాయనే భయం. కానీ హాకింగ్ హెచ్చరికలో అంతకంటే కీలకమైన అంశం ఉంది. ఏఐకి మనుషులపై ద్వేషం ఉండాల్సిన అవసరం లేదు. అది తనకు నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడంలో అత్యంత సమర్థంగా పనిచేస్తూ, మానవ ప్రయోజనాలను పట్టించుకోకపోయినా ప్రమాదం ఏర్పడవచ్చు. ఉదాహరణకు, ఒక ఏఐ వ్యవస్థకు నిర్దేశించిన లక్ష్యం మానవ అవసరాలు, భద్రతతో సరిపోలకపోతే.. ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో మనుషులకు హాని కలిగించే నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉందనే ఆందోళన ఉంది. అందుకే ఏఐ ఎంత శక్తిమంతంగా మారుతుందన్నదే కాకుండా, అది ఏ లక్ష్యాలతో పనిచేస్తోంది? దాని నిర్ణయాలు మానవ విలువలకు అనుగుణంగా ఉన్నాయా? దానిపై అవసరమైన నియంత్రణ ఉందా? అనే అంశాలు కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ, విజయవంతమైన ఏఐ అభివృద్ధి మానవ చరిత్రలోనే అత్యంత గొప్ప సంఘటన కావచ్చని హాకింగ్ అన్నారు. అయితే దాని వల్ల కలిగే ప్రమాదాలను నివారించడం నేర్చుకోకపోతే, అదే మానవాళికి చివరి ఘట్టంగా మారే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏఐ అభివృద్ధిని పూర్తిగా ఆపేయాలన్నది కాదు. దాని వల్ల కలిగే ప్రయోజనాలను అందిపుచ్చుకుంటూనే, మానవ నియంత్రణకు అందని స్థాయికి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నదే. వైద్యం, శాస్త్రీయ పరిశోధనలు, వాతావరణ అంచనాలు వంటి రంగాల్లో ఏఐ మానవాళికి ఎంతో మేలు చేస్తుంది. అదే సమయంలో సరైన పర్యవేక్షణ లేకపోతే, తప్పుగా నిర్దేశించిన లక్ష్యాలు తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చు.
ఏఐ అభివృద్ధితో పాటు మానవ జోక్యం లేకుండానే లక్ష్యాలను గుర్తించి దాడి చేయగల ఆయుధ వ్యవస్థలు భవిష్యత్తులో ప్రమాదకరంగా మారవచ్చని పలువురు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దేశాల మధ్య ఏఐ ఆధారిత ఆయుధాల పోటీ పెరిగితే, వాటి వినియోగంపై నియంత్రణ కష్టమయ్యే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో నియంత్రణలు, స్పష్టమైన నిబంధనలు అవసరమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏఐ అభివృద్ధి కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా, దాని వల్ల కలిగే ప్రమాదాలను అంచనా వేయడం, బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించడం ముఖ్యం.
స్టీఫెన్ హాకింగ్ తన చివరి పుస్తకం Brief Answers to the Big Questionsలో ఏఐ పై తన ఆలోచనలను పంచుకున్నారు. శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు, సాంకేతిక సంస్థలు కలిసి ఏఐ అభివృద్ధికి తగిన భద్రతా ప్రమాణాలు రూపొందించాలి. ఏఐ తీసుకునే నిర్ణయాలపై పర్యవేక్షణ, దాని వినియోగంలో పారదర్శకత, బాధ్యతాయుతమైన పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
మొత్తంగా.. ఏఐ మానవాళికి వరమా, శాపమా అనేది ఆ సాంకేతికతను మనం ఎలా అభివృద్ధి చేస్తాం, ఎలా ఉపయోగిస్తాం అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. మనుషుల జీవితాలను మెరుగుపరిచే సాధనంగా ఏఐని తీర్చిదిద్దాలంటే, దాని సామర్థ్యంతో పాటు భద్రతకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. స్టీఫెన్ హాకింగ్ హెచ్చరికల్లోని ప్రధాన సందేశం ఇదే.