
ఉదయం నుంచి బ్యాంకు పనులతో సతమతమైన ఉద్యోగులు.. ఇంటికెళ్ళే సమయంలో తాళం వేయడం మర్చిపోయారు. సాయంత్రం నుంచి బ్యాంక్ అలానే తెరుచుకుని ఉంది.. సరిగ్గా రాత్రి 9 గంటలకు అటుగా వెళ్తున్న కొంతమంది గ్రామస్తులు బ్యాంక్ తలుపులు తెరిచి ఉండటంతో.. లోపలకు వెళ్లి చెక్ చేశారు. ఎవరూ లేకపోవడాన్ని గమనించి.. వెంటనే బ్యాంక్ అధికారులకు సమాచారాన్ని అందించారు. కట్ చేస్తే.. తెల్లారేసరికి ఇందుకు బాధ్యలులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రామనాధపురం జిల్లాలోని పోతకవయాల్ గ్రామంలో వ్యవసాయ సహకార బ్యాంక్ ఉంది. రోజూలానే ఈ శనివారం బ్యాంకులో ఉదయం నుంచి పనులు చేసిన ఉద్యోగులు సాయంత్రం వెళ్లే సమయంలో తాళం వేయడం మర్చిపోయి..ఇంటికి వెళ్లిపోయారు. సరిగ్గా రాత్రి 9 గంటల సమయంలో అటుగా వెళ్లిన కొందరు గ్రామస్తులు బ్యాంక్ తెరిచి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూడగా.. ఎవ్వరూ లేకపోవడంతో వెంటనే బ్యాంక్ అధికారులకు సమాచారాన్ని అందించారు. అనంతరం కొన్ని గంటలకు అక్కడికి చేరుకున్న అధికారులు.. ఆపై బ్యాంకుకు తాళం వేశారు. కట్ చేస్తే.. తెల్లారేసరికి ఈ ఘటనపై బ్యాంక్ ముందు ఆందోళనకు దిగారు ఖాతాదారులు. కాగా, బ్యాంకుకు తాళం వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.