
గ్రామీణ ప్రాంతాలు, అడవులకు సమీపంలో ఉన్న గ్రామాల్లోకి విషసర్పాలు, కొండచిలువలు రావడం మనం తరచూ చూస్తుంటాం. కానీ, ఒక భారీ కొండచిలువ నేరుగా ఇళ్ల ముంగిటకు వచ్చి, గుమ్మం నుంచి లోపలికి చొరబడటానికి ప్రయత్నిస్తే ఆ భయం వర్ణనాతీతం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో అలాంటి ఒక ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఓ కొండచిలువను ఇంటి యజమాని ప్రాణాలకు తెగించి అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సమీపంలో ఉన్న హసన్‌పూర్ కదీమ్ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. సమీపంలోని వ్యవసాయ పొలాల నుంచి బయటకు వచ్చిన ఒక భారీ కొండచిలువ గ్రామంలోని వీధి గుండా పాకుతూ వచ్చింది. క్రమంగా అది రోడ్డు పక్కనే ఉన్న ఒక నివాస గృహం వైపు వెళ్ళడం ప్రారంభించింది. చూస్తుండగానే ఆ భారీ సర్పం ఇంటి ప్రధాన ద్వారం నుంచి లోపలికి చొరబడటానికి ప్రయత్నించింది. ఇంట్లోకి కొండచిలువ వస్తుండటాన్ని గమనించిన సదరు ఇంటి యజమాని ఏమాత్రం భయపడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. అది లోపలికి వెళ్తే కుటుంబ సభ్యుల ప్రాణాలకే ముప్పు అని భావించి, ప్రాణాలకు తెగించి ఆ భారీ కొండచిలువను వెనక నుంచి పట్టుకున్నాడు. దాన్ని గట్టిగా పట్టుకుని గుమ్మం నుంచి బయటకు లాగేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఈ దృశ్యం చూసి చుట్టుపక్కల జనం, బాటసారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
వీధి మధ్యలో ఒక వ్యక్తి కొండచిలువతో పోరాడటం చూసి అక్కడ భారీగా జనం గుమిగూడారు. పలువురు తమ ఫోన్లలో ఈ భయానక దృశ్యాలను వీడియోలు తీస్తుండగా, అంతటి భారీ సర్పం పరిమాణాన్ని చూసి ఊరి జనం కంగారుపడ్డారు. దీనివల్ల కాసేపు ఆ రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. స్థానికులు తెలివిగా ఆ కొండచిలువను ఒక మూలకు పరిమితం చేసి, వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. స్థానికుల సహాయంతో ఎంతో శ్రమించి అధికారులు ఆ భారీ కొండచిలువను క్షేమంగా బంధించారు. ఆ తర్వాత దాన్ని సమీపంలోని హస్తినాపూర్ వైల్డ్ లైఫ్ శాంచ్యురీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. కొండచిలువను పట్టుకోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సాహస పోరాటానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.