
ప్రకృతి తనలో ఎన్నో వింతలను, రహస్యాలను దాచుకుంది. భూమిపై కోట్లాది సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైనోసార్ల కాలం నాటి ఒక అద్భుతమైన ఆనవాలు తాజాగా శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. చైనాలోని యున్నాన్ రాష్ట్రంలోని దట్టమైన అడవుల్లో పరిశోధకులు సరికొత్త జాతికి చెందిన భారీ పుట్టగొడుగును కనుగొన్నారు. దీనిని శాస్త్రీయంగా డియాంజునస్ రెక్స్ అని పిలుస్తున్నారు. ఈ అద్భుతమైన ఆవిష్కరణ శిలీంధ్రాల పరిణామ క్రమానికి సంబంధించి సరికొత్త చరిత్రను లిఖిస్తోంది.
ఈ వింత పుట్టగొడుగు సుమారు 65 మిలియన్ సంవత్సరాల క్రితం, అనగా డైనోసార్లు అంతరించిపోతున్న కాలం నాటి నుంచే ఉనికిలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. చైనాలోని కున్మింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బాటనీ పరిశోధకులు ఈ పరిశోధనను నిర్వహించారు. ఈ భారీ శిలీంధ్రం దాదాపు 50 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని బరువు సుమారు 2.2 కిలోగ్రాముల వరకు ఉంటుంది. ఇప్పటివరకు అస్కోమైకోటా వర్గంలో ఇంత భారీ ఫ్రూటింగ్ బాడీలు కలిగిన పుట్టగొడుగులు ఎక్కడా వెలుగుచూడకపోవడం విశేషం.
ఈ అద్భుతమైన జాతి ద్వారా శాస్త్రవేత్తలు డియాంజునేసి అనే సరికొత్త ఫంగల్ కుటుంబాన్ని అధికారికంగా నిర్ధారించారు. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనూ, దట్టమైన అడవుల్లోనూ ఇవి ఎలా మనుగడ సాగించాయో తెలుసుకోవడానికి ఈ ఆవిష్కరణ ఒక అరుదైన అవకాశాన్ని ఇస్తోంది. ముఖ్యంగా తూర్పు ఆసియా ప్రాంతాల్లోని అడవుల్లో ఇంకా మానవులకు తెలియని జీవవైవిధ్యం ఎంతో దాగి ఉందని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.
చెట్లు, మొక్కల అవశేషాలను కుళ్ళింపజేయడంలో ఈ రకమైన శిలీంధ్రాలు కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు వెల్లడించారు. ఆధునిక జన్యుపరమైన సాంకేతికత, క్షేత్ర స్థాయి పరిశోధనల కారణంగా భవిష్యత్తులో ఇలాంటి విస్మయకరమైన జీవులు మరింత వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, కోట్ల సంవత్సరాల నాటి చరిత్రను తనలో దాచుకున్న ఈ డియాంజునస్ రెక్స్ టెక్ ప్రపంచంలోనూ, జీవశాస్త్ర రంగంలోనూ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..