COVIDVaccine: భారత్‌లో ఫైజర్ టీకా వినియోగానికి అనుమతివ్వండి.. వ్యాక్సిన్ రేసులో డీసీజీఐకి తొలి దరఖాస్తు..!

|

Dec 06, 2020 | 2:13 PM

ఫైజర్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ భారత్‌కు వస్తుందా..? కరోనా బాధితులకు ఫైజర్ టీకా అందుతుందా? పరిస్థితి చూస్తుంటే వీలైనంత త్వరలోనే ..

COVIDVaccine: భారత్‌లో ఫైజర్ టీకా వినియోగానికి అనుమతివ్వండి.. వ్యాక్సిన్ రేసులో డీసీజీఐకి తొలి దరఖాస్తు..!
Follow us on

ఫైజర్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ భారత్‌కు వస్తుందా..? కరోనా బాధితులకు ఫైజర్ టీకా అందుతుందా? పరిస్థితి చూస్తుంటే వీలైనంత త్వరలోనే ఫైజర్ టీకా భారత్‌లోనూ అందుబాటులోకి రానుందని అర్థమవుతోంది. తాజాగా భారత్‌లో ఫైజర్ టీకాను అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాల్సిందిగా అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ ‘భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ)’ని కోరింది. ఈ మేరకు డిసెంబర్ 4వ తేదీనే ఫైజర్ దరఖాస్తు చేసుకుంది. ఈ విషయాన్ని డీసీజీఐ అధికారులు ప్రకటించారు. భారత్‌లో ఫైజర్ వ్యాక్సిన్‌ పంపిణీ, విక్రయించేందుకు వీలుగా దిగుమతికి అనుమతివ్వాలని కూడా డీసీజీఐని కోరింది. అలాగే.. భారత ప్రజలపై క్లినికల్ పరీక్ష నిర్వహణ ఆవశ్యకతను ప్రత్యేక నిబంధనల కింద రద్దు చేయాలని డీసీజీఐకి ఫైజర్ విజ్ఞప్తి చేసింది.

కాగా, ఇప్పటికే ఫైజర్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ వినియోగానికి బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తాజాగా మరో దేశం బహ్రెయిన్ కూడా ఫైజర్ టీకా వినియోగానికి ఆమోద ముద్ర వేసింది. ఇప్పుడు భారత్‌లోనూ ఫైజర్ వినియోగానికి దరఖాస్తు చేసుకోవడంతో అందరి దృష్టి భారత్‌పై పడింది. మరి భారత్‌లో ఫైజర్‌ వినియోగానికి డీసీజీఐ అనుమతిస్తుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే. ఇదిలాఉంటే.. కరోనా వ్యాక్సిన్ తయారీ రేస్‌లో డీసీజీఐకి అందిన తొలి దరఖాస్తు ఇదే కావడం విశేషం.