పెంపుడు జంతువులు వాటి యజమానుల మధ్య సంబంధాన్ని వ్యక్తిగతంగా అనేక సందర్బాల్లో చూస్తుంటాం. అలాగే, సినిమాలు, సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతున్న వీడియోల ద్వారా చూసినప్పుడు మనకు కన్నీళ్లు పెట్టిస్తాయి. జంతువులు బహుశా మనుషుల కంటే ఎక్కువ విశాల హృదయం, దయ, ప్రేమ, విశ్వాసం, శ్రద్ధగలవని రుజువు చేసే సంఘటనలు అనేక సార్లు చూశాం. విన్నాం. ఇప్పుడు ఇలాంటి ఘటనే మరోకటి వెలుగులోకి వచ్చింది. జంతు ప్రేమికుల బృందం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రతి ఒక్కరినీ కదిలించేదిగా ఉంది. ఒక పెంపుడు కుక్క తన యజమాని కోసం చూస్తున్న ఎదురు చూపులు అందరినీ ఏడిపించేలా చేసింది. వివరాల్లోకి వెళితే..
ఫిలిప్పీన్స్‌లోని కాల్‌కూన్ సిటీలోని MCU హాస్పిటల్ మార్చురీ ముందు ఒక కుక్క రోజుల తరబడి పడిగాపులు కాస్తుంది.. ఆహారం, నిద్ర లేకుండా ఆ కుక్క ఎక్కడికి వెళ్లినా తిరిగి ఇదే ఆసుపత్రికి చేరుకుని మార్చురీ ముందే ఎదురు చూస్తుంది..ఇక్కడ పనిచేసే సిబ్బంది, అక్కడ చదువుతున్న విద్యార్థులు ఆ కుక్కకు మోర్గాన్ అని పేరు పెట్టారు. మోర్గాన్ అనే పేరు ఎందుకంటే ఇది మృతదేహం ముందు ఎదురుచూస్తుందని అర్థమట. వాస్తవానికి, మోర్గాన్ తన యజమాని అదే ఆసుపత్రిలో చేరి చనిపోగా, ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. ఆ ఘటన జరిగి ఇప్పటికి ఏడాది గడిచింది.
మోర్గాన్ యజమాని కోవిడ్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. అతడి పరిస్థితి మరింతగా విషమించింది.. చివరకు ప్రాణాలు కోల్పోయాడు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అతడు మృత్యువాత పడ్డాడు. కానీ అతను చనిపోయాడని తన పెంపుడు కుక్క మోర్గాన్‌కు అర్థం కాలేదు. అది చివరి సారిగా తన యజమానిని ఆస్పత్రి మార్చురీ ప్రాంగణంలోనే చూసింది..దాంతో అతడు అందులోనే ఉన్నాడని భావించింది.. కాబట్టి అది అతని కోసం అక్కడే వేచి ఉంటోంది. ఒకటి, రెండు, మూడు రోజులు కాదు, నెలలు. ఇప్పటికి ఏడాది గడిచిపోయిందని ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది, అక్కడ చూసిన వారు చెబుతున్నారు. ఆస్పత్రి సిబ్బంది, చికిత్స కోసం వచ్చిన వారి బంధువులు, కుటుంబ సభ్యులు ఇచ్చే ఆహారం తింటూ అక్కడే ఉంటుంది. తన యజమాని తిరిగి రాడని తెలియక ఆ మూగజీవి పడుతున్న ఆవేదన అందరినీ కలచివేసింది.
ఇదంతా తెలిసి ఆసుపత్రి సిబ్బంది, జంతు ప్రేమికుల సంఘం మోర్గాన్‌కు తగిన యజమానుల కోసం వెతుకుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మోర్గాన్ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో చేరటంతో.. అన్ని సరిహద్దులను దాటి ప్రపంచంలోని అనేక ప్రాంతాల ప్రజలకు చేరుకుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..