Running: అదో రైల్వే స్టేషన్.. అక్కడ కొద్దిసేపటి క్రితమే ఒక రైలు వచ్చి ఆగింది. ప్రయాణీకులు మెల్లగా స్టేషన్ నుంచి బయటకు వస్తున్నారు. ఇంతలో స్టేషన్ లోపల కలకలం. పదుల సంఖ్యలో ప్రయాణీకులు పడుతూ లేస్తూ స్టేషన్ బయటకు పరుగులు తీస్తూ వస్తున్నారు. వారంతా ఎదో ప్రమాదం జరిగినట్టు ఆందోళనగా ఉరుకులు తీస్తున్నారు. చేతిలో లగేజీ పడిపోతుంటే.. దానిని గట్టిగా పట్టుకుని.. పిల్లా జెల్లా అందర్నీ పరుగులు తీయిస్తూ స్టేషన్ బయటకు వచ్చేశారు. ఇదంతా ఏమిటని ఆరా తీస్తే.. విషయం విన్నవారు అవాక్కయ్యారు. ఇంతకీ ఎందుకు అంతలా పరుగులు తీసారంటే.. స్టేషన్ లో హెల్త్ వర్కర్లు కరోనా పరీక్షలు చేయించుకోమని వారిని కోరారట! ఈ సంఘటన శుక్రవారం రాత్రి బీహార్ లోని బక్సర్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. ఈ ప్రయాణీకులు ఇలా బయటకు పరిగెత్తుకు రావడం వీడియో తీసిన ఒకరు దానిని ట్విట్టర్ లో ఉంచారు. దీంతో ఈ వీడియో ట్రేండింగ్ గా మారింది.
బీహార్ లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవల బీహార్ లోని అన్ని రైల్వే స్టేషన్లలోనూ కోవిడ్ పరీక్షలు చేయాలని ఆదేశించారు. బీహార్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఉపాధి కోసం వలస వెళుతుంటారు ప్రజలు. ఇప్పుడు కరోనా రెండో వేవ్ దేశవ్యాప్తంగా విరుచుకుపడుతోంది. ఈ నేపధ్యంలో అన్నిముఖ్యమైన నగరాల్లోనూ రాత్రి కర్ఫ్యూ.. అదేవిధంగా పలు కోవిడ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాలకు వలస వెళ్ళిన ప్రజలు తిరిగి తమ స్వస్థలాలకు వచ్చేస్తున్నారు. ఈ నేపధ్యంలో బీహార్ నుంచి వలస వెళ్ళినవారూ తిరిగి రావడం ప్రారంభించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అందులో భాగంగానే రైళ్ళలో తిరిగి వస్తున్న ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు.
బీహార్ రైల్వేస్టేషన్ లలో ఇలా జరగడం మొదటిసారి కాదనీ, దాదాపు ప్రతిరోజూ ఇలా జరుగుతూనే ఉంటుందని రైల్వే అధికారి ఒకరు ఈ సంఘటనపై వ్యాఖ్యానించారు.
రైలు నుంచి దిగిన ప్రయాణీకులను కోవిడ్ టెస్ట్ చేయించుకోమని కోరాను. అయితే, వారు నాతో వాదనకు దిగారు. అక్కడ నేను ఒక్కదానినే ఉన్నాను. వెంటనే, పోలీసుల సహాయం కోరాను అని ఆ హెల్త్ వర్కర్ చెప్పారు.
ప్రస్తుతం బీహార్ లో పలు రైల్వేస్టేషన్ లలో ఇలానే జరుగుతోంది. ”బీహార్ నుంచి ముంబాయి వలస వెళ్ళేవారు ఎక్కువ. ఇప్పుడు ముంబాయిలో కరోనా వేవ్ చాలా అధికంగా ఉంది. అక్కడ నుంచి నేరుగా రైళ్ళలో వందలాది మంది నిత్యం రాష్ట్రంలోకి తిరిగి వస్తున్నారు. వారు కరోనా పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించి పారిపోతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.” అని చెబుతున్నారు బీహార్ అధికారులు.
బీహార్ రైల్వేస్టేషన్ నుంచి పరుగులు తీస్తున్న ప్రయాణీకులను మీరూ చూడండి..
यह दृश्य कल रात बक्सर स्टेशन का हैं और ये यात्री पुणे -पटना से उतरे हैं और कोरोना जाँच ना कराना पड़े इसलिए भाग रहे हैं @ndtvindia @Anurag_Dwary @suparba pic.twitter.com/cWxDDoP26X
— manish (@manishndtv) April 16, 2021