
భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. నేడు దేశవ్యాప్తంగా బుల్లెట్ రైళ్లు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు, డిజిటల్ టికెటింగ్ సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ, ఆధునిక యుగంలో నడుస్తున్న మన దేశంలోనే ఇప్పటికీ ఎన్నో ఏళ్లుగా కనీసం ప్లాట్‌ఫారమ్ గానీ, టికెట్ కౌంటర్ గానీ లేని రైల్వే స్టేషన్లు ఉన్నాయంటే నమ్ముతారా? రాజస్థాన్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక రైల్వే స్టేషన్ కథ వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
రాజస్థాన్‌లోని బాడ్మేర్ జిల్లాలో భారత్-పాక్ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ల పరిధిలో ఈ వింతైన సంఘటన వెలుగుచూసింది. సరిహద్దు ప్రాంతం కావడం, జనాభా చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంతంలో రైల్వే సదుపాయాల అభివృద్ధి చాలా నెమ్మదిగా సాగింది. ఫలితంగా ఇక్కడి ప్రయాణికులు ఎన్నో ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతూ వింతైన పద్ధతుల్లో ప్రయాణించాల్సి వచ్చింది.
సాధారణంగా ఏ రైల్వే స్టేషన్‌లోనైనా ప్లాట్‌ఫారమ్ అనేది ప్రాథమిక సదుపాయం. కానీ, ఈ స్టేషన్‌లో కొన్ని సంవత్సరాల పాటు ప్లాట్‌ఫారమ్‌లే లేవు. రైలు నేరుగా పట్టాల పక్కనే ఆగేది. ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు కింద నేలపై నిలబడి ఎంతో కష్టపడి రైలు డబ్బాల్లోకి ఎక్కాల్సి వచ్చేది. ఇది చాలా ప్రమాదకరంగా మారినప్పటికీ ప్రయాణికులకు వేరే ప్రత్యామ్నాయం ఉండేది కాదు.
ఈ స్టేషన్ల అన్నింటికంటే వింతైన విషయం ఇక్కడి టికెట్ బుకింగ్ వ్యవస్థ. ఇక్కడ ఎలాంటి టికెట్ విండో లేదా పర్మనెంట్ బుకింగ్ ఆఫీస్ ఉండేది కాదు. రైలు రావడానికి కొన్ని నిమిషాల ముందు ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ తన భుజానికి ఒక పెద్ద బ్యాగు తగిలించుకుని స్టేషన్‌కు వచ్చేవాడు. ఆ బ్యాగు నిండా ప్రయాణ టికెట్లు ఉండేవి. ప్రయాణికులు ఆ కాంట్రాక్టర్ చుట్టూ చేరి చేతిలో డబ్బులు పెట్టి బ్యాగులోంచి టికెట్లు కొనుగోలు చేసేవారు.
ఈ విచిత్రమైన పరిస్థితిపై సామాజిక మాధ్యమాల్లో చర్చ నడవడంతో రైల్వే యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది. ప్రస్తుతం ఈ సరిహద్దు స్టేషన్ల ఆధునీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ సుమారు 600 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫారమ్‌లను నిర్మిస్తున్నారు. అలాగే విద్యుద్దీకరణ, ఇతర ప్రాథమిక వసతుల కల్పన కూడా జరుగుతోంది. త్వరలోనే సరిహద్దు ప్రాంత ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే తమ లక్ష్యమని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..