
సుమారు 8 నెలలుగా పోలీస్ కస్టడీలో ఉన్న ఓ పావురానికి ఎట్టకేలకు విముక్తి లభించింది. పావురం ఏంటి.? పోలీస్ కస్టడీలో ఉండడం ఏంటి.? అని ఆలోచిస్తున్నారా.? ఈ విచిత్రకరమైన సంఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో జరిగింది. ఇంతకీ పావురాన్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
గతేడాది మే నెలలో ముంబయి పోర్ట్ వద్ద ఒక పావురం అనుమానాదస్పదంగా కనిపించింది. పావురం రెక్కలపై చైనా భాషలో అక్షరాలు రాసి ఉండడంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. చైనాకు చెందిన ఆ పావురాన్ని గూఢచర్యం చేస్తున్నట్లు అనుమానించిన పోలీసులు పావురాన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పావురంపై గూఢచర్యం కేసు నమోదు చేసిన కస్టడీలోకి తీసుకున్నారు. గత 8 నెలలుగా వెటర్నరీ హాస్పిటల్ వద్ద పంజరంలో ఆ పావురాన్ని ఉంచి తాళం వేశారు. ఇంతకీ ఆ పావురం ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై సుదీర్ఘ దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉంటే పక్షిని అనవసరంగా బంధించారంటూ పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేశారు. పక్షిని విడిచేయాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు.. ఆ పావురం ఎలాంటి గూఢచర్యానికి పాల్పడలేదని తేల్చారు. దీంతో తాజాగా పావురాన్ని పంజరం నుంచి విడిపించి పావురానికి స్వేచ్ఛను ఇచ్చారు. పెటా కార్యకర్తల సమక్షంలో పావురాన్ని పంజరం నుంచి విడిపించగానే ఎంచక్కా గాల్లోకి ఎగిరిపోయింది.
ఇదిలా ఉంటే కేసు దర్యాప్తులో భాగంగా ఆ పావురం తైవాన్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఆ పావురాన్ని వాటర్ రేసింగ్‌లో పాల్గొనేందుకు వాడేదని తేల్చారు. పోటీలో పాల్గొన్న క్రమంలోనే దేశం దాటి భారత్‌కు వచ్చినట్లు గుర్తించారు. పావురాన్ని గుర్తించిన సమయంలో దాని కాళ్లకు ఉంగరాలు ఉండడం, పావురం రెక్కల కింది భాగంలో చైనీస్ అక్షరాలు రాసి ఉండడంతో అనుమానాన్ని కారణమైంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..