
నిజమైన సంతోషం కోట్లు ఖర్చు పెడితే రాదు.. ఆత్మీయుల మధ్య గడిపే ఆనంద క్షణాల్లోనే దొరుకుతుంది. నేటి సమాజంలో పెళ్లిళ్లు, వేడుకలు అంటేనే లక్షల రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేస్తూ ఆర్భాటంగా చేసుకునే రోజులివి.. అలాంటి రోజులలో సాధారణ కూలీ దంపతుల షష్టిపూర్తి వేడుక ఎలా ఉంటుంది.! వాళ్ళ కళ్ళలో నిజమైన ఆనందం ఎలా..! మీరే చూడండి
ఖరీదైన ఫంక్షన్ హాళ్లు, వందలాది బంధువుల కోలాహలం, రకరకాల విందు భోజనాలు ఉంటేనే పండుగ అనుకునే కాలంలో.. ఓ నిరుపేద జంట మాత్రం తమ నిరాడంబరతతో అందరికీ గొప్ప ఆదర్శంగా నిలిచింది.. డబ్బు కంటే మనుషుల మధ్య ఉండే ప్రేమానురాగాలే ఎంతో గొప్పవని నిరూపిస్తూ ఉపాధిహామీ పని ప్రదేశంలోనే తమ షష్టిపూర్తి వేడుకను జరుపుకొని గుండెల్ని హత్తుకునేలా చేసింది. ఆడంబరాలకు ఏమాత్రం తావు లేకుండా జరిగిన ఈ వేడుక ఇప్పుడు ప్రతి ఒక్కరినీ లోతుగా ఆలోచింపజేస్తోంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అప్పారాజుపల్లి గ్రామ శివారులో ఈ వేడుక జరిగింది.. పుట్లపాట్ తండాకు చెందిన వృద్ధ దంపతులు భూక్య కస్నా – అమ్మిల వివాహ బంధం విజయవంతంగా 60 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకుని, తోటి ఉపాధిహామీ కూలీలు పని ప్రదేశంలోనే వారికి ఘనంగా ‘షష్ఠిపూర్తి’ వేడుక నిర్వహించారు.
ఉపాధి పనులు ముగిసిన వెంటనే, సాంప్రదాయ పద్ధతిలో వృద్ధ దంపతులను దండలు మార్పించి మళ్లీ పెళ్లి వేడుక జరిపించారు. తోటి కూలీల చప్పట్లు, కేరింతల మధ్య నూతన వధూవరుల్లా మెరిసిన ఆ వృద్ధ దంపతులను స్థానిక యువకులు చాక్లెట్స్ పంచి అవే మిఠాయిలు, విందు భోజనంలా అభినందించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..