
జాతీయ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ మరోసారి భారీ రాజకీయ, సామాజిక నిరసనలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, భారత ఎన్నికల వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ వివిధ సంస్థలు నిరసనలు చేస్తున్నాయి. అయితే, ఈ ప్రసిద్ధ నిరసన ప్రదేశంలో మొదటగా ఎవరు నిరసన తెలిపారు? ఎవరికి వ్యతిరేకంగా? ఈ నిరసనలకు దారితీసిన కారణాలేమిటో తెలుసుకుందాం.
జంతర్ మంతర్‌ను 1724లో జైపూర్ మహారాజు సవాయ్ జైసింగ్ II నిర్మించారు. ఖగోళ శాస్త్రంపై ఉన్న తీవ్ర ఆసక్తితో కాలక్రమాన్ని, గ్రహాల స్థితిగతులను ఖచ్చితంగా గణించడానికి ఆయన ఢిల్లీతో పాటు జైపూర్, ఉజ్జయిని, వారణాసి, మధురలలో వీటిని నిర్మించారు.
1993 కంటే ముందు, భారతదేశంలో పెద్ద ఎత్తున జరిగే నిరసనలు, ర్యాలీలకు ఢిల్లీలోని బోట్ క్లబ్ కేంద్రంగా ఉండేది. అయితే 1988లో రైతు నాయకుడు మహేంద్ర సింగ్ తికాయత్ ఆధ్వర్యంలో లక్షలాది మంది రైతులు బోట్ క్లబ్ పరిసరాలను ముట్టడించి దాదాపు వారం రోజుల పాటు ఢిల్లీని దిగ్బంధించారు. ఈ సంఘటనతో తీవ్ర భద్రతా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. తదనంతరం, 1993లో ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పార్లమెంట్ సమీపంలోని బోట్ క్లబ్ వద్ద ధర్నాలను నిషేధించి, నిరసనకారుల కోసం పార్లమెంట్ వీధిలోని జంతర్ మంతర్ ను అధికారిక వేదికగా కేటాయించింది.
జంతర్ మంతర్ వద్ద మొదటిసారిగా చిన్నతరహా కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు తమ డిమాండ్ల సాధనకై ధర్నాలు ప్రారంభించాయి. ఆ తర్వాత, ఈ ప్రదేశం అనేక చారిత్రాత్మక ఉద్యమాలకు వేదికైంది. 2011లో అన్నా హజారే చేపట్టిన జన్ లోక్‌పాల్ ఉద్యమం ఇక్కడి నుంచే దేశవ్యాప్త ప్రభంజనంగా మారింది. తమిళనాడు, పంజాబ్ రైతుల వినూత్న నిరసనలు. రెజ్లర్లు జరిపిన ఆందోళనలు కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ప్రభుత్వ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లడానికి పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కును చాటిచెప్పే బలమైన ప్రజాస్వామ్య చిహ్నంగా జంతర్ మంతర్ నిలిచింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..