Israel for India: కరోనా మహమ్మారితో భారతదేశం అలుపెరుగని పోరాటం చేస్తోంది. ఒక పక్క విరుచుకుపడుతున్న వైరస్.. మరో పక్క ఆక్సిజన్ కొరత.. ఇంకోవైపు ఆసుపత్రుల్లో వసతుల లేమి కరోనాపై చేస్తున్న పోరాటానికి ఆటంకంగా మారాయి. అయినా, పట్టువదలకుండా.. కరోనాపై యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది ఇండియా. ఇక దేశంలో నెలకొన్న పరిస్థితులపై అంతర్జాతీయ సమాజం సానుభూతి కురిపిస్తోంది. ఆపద వేళలో మేమున్నాం అంటూ ఎన్నో దేశాలు ముద్న్కు వచ్చి ఇండియాకు చేయూత ఇస్తున్నాయి. మందులు, ఆక్సిజన్ వంటి అత్యవసరాలను విమానాల్లో తరలించి సహకరిస్తున్నాయి. అంతేకాకుండా, ఆయా దేశాల్లో ప్రజలు కూడా భారతీయులకు అండగా ఉన్నామంటూ తమవంతుగా ధైర్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రజలు చేసిన ఒక పని నెట్టింట్లో వైరల్ గా మారింది. అక్కడి ప్రజలు ఓం నమశ్శివాయ అంటూ భారత ప్రజల కోసం ప్రార్ధనలు చేశారు. ఇది సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి మనసునూ కదిలించింది.
ఇజ్రాయెల్ లోని అవీవ్‌లోని హబీమా స్క్వేర్ వద్ద వందలాది మంది కూర్చుని మంత్రాన్ని పఠించడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోను ఇజ్రాయెల్‌లోని భారతీయ దౌత్యవేత్త పవన్ కె పాల్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పంచుకున్నారు. ”ఇజ్రాయెల్ మొత్తం మీకోసం ఐక్యంగా ఉన్నపుడు మీకు ఆశాకిరణం కనిపిస్తుంది” అంటూ భారతీయుల నుద్దేశించి ఆయన ఆ ట్వీట్ కు శీర్షిక జోడించారు. దీంతో ఈ వీడియో చాలా లైకుల్ని, షేర్ లను సాధించింది. ఇక ఈ వీడియోకి వస్తున్నా కామెంట్స్ అయితే చెప్పక్కర్లేదు. ”ధన్యవాదములు ఇజ్రాయెల్.. ఇది అందమైన సంకేతం.. ఇజ్రాయెల్ కోవిడ్ ఫ్రీ కావడం ఆనందాన్ని ఇస్తోంది.” అంటూ చాలా మంది కామెంట్లు పెడుతున్నారు.
Israel for India: ఆ వీడియో ఇక్కడ చూడండి..
అంతకు ముందే ఇజ్రాయెల్ భారతదేశానికి సహాయం అందిస్తామని ప్రకటించింది. త్వరలోనే అక్కడ నుంచి కరోనాపై పోరుకు ఆక్సిజన్ జేనరేటర్లు, రేస్పిరేటర్లు వంటి వైద్య పరికరాలు ఇండియాకు అందే అవకాశం ఉందని భావిస్తున్నారు.