
ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే టూరిస్టులు చేసే కొన్ని పనులు దేశం పరువును అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చేలా ఉంటున్నాయి. తాజాగా వియత్నాం ఎయిర్‌పోర్టులో చోటుచేసుకున్న ఓ ఘటన నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. విమానాశ్రయం లాంజ్‌లో కుర్చీలు అందుబాటులో ఉన్నప్పటికీ, కొందరు భారతీయ పర్యాటకులు నేలపై కూర్చుని భోజనం చేస్తున్న దృశ్యాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. భారతీయులు ఎక్కువగా ఇష్టపడే కొత్త పర్యాటక ప్రాంతాలలో వియత్నాం ఒకటిగా మారుతోందని, కానీ అక్కడ మన పర్యాటకులు ప్రవర్తించే తీరు గమనించదగ్గ విషయమని ఆయన అన్నారు. విమానాశ్రయాలను పిక్నిక్ స్పాట్ల మాదిరిగా మార్చేసి, అక్కడ ఆహారాన్ని చెల్లాచెదురు చేయడం, అపరిశుభ్రంగా ఉంచడం వంటి పనుల వల్ల మనం అనైతిక పర్యాటకులుగా ముద్ర వేయించుకునే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. బాధ్యతాయుతంగా, సరైన పౌర స్పృహతో ప్రయాణించడం మనం ఎప్పుడు నేర్చుకుంటాం? అంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పోస్ట్‌పై వేలాది మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. సోషల్ మీడియాలో దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు యూజర్లు తీవ్రంగా మండిపడుతూ.. ఇలాంటి సంస్కారహీనమైన పనుల వల్లే విదేశాల్లో భారతీయులకు చెడ్డ పేరు వస్తోందని, నిబంధనలు పాటించని వారి పాస్‌పోర్టులను రద్దు చేయాలని ఘాటుగా కామెంట్లు చేశారు. సింగపూర్ వంటి దేశాల్లో ఇలాంటి పనులు చేసే సాహసం చేయరని గుర్తుచేశారు.
మరోవైపు, కొందరు నెటిజన్లు దీనిని వ్యంగ్యంగా తీసుకుంటూ ఎయిర్‌పోర్టుల తీరును తప్పుబట్టారు. ప్రయాణికులకు తగిన వసతులు కల్పించడంలో ఎయిర్‌పోర్టు యంత్రాంగం విఫలమైందని, కూర్చునేందుకు సరైన కుర్చీలు ఇవ్వకపోవడం వల్లే వారు ఆ విధంగా కూర్చోవాల్సి వచ్చిందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పర్యాటకులుగా వేరే దేశాలకు వెళ్లినప్పుడు ఆయా దేశాల నిబంధనలను, అక్కడి పబ్లిక్ ప్రాపర్టీని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్న చిన్న అజాగ్రత్తలు లేదా నిర్లక్ష్యపు చర్యలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ప్రయాణ సమయాల్లో పౌర స్పృహను ప్రదర్శించడం ద్వారా మన దేశ గౌరవాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..