
నలుపు తెలుపు రంగులో.. రెక్కల స్థానంలో ఫ్లిప్పర్లతో .. నడిచే తీరుతో పెంగ్విన్‌ను ఇట్టే గుర్తుపట్టేయచ్చు. కానీ శాస్త్రవేత్తలను కూడా ఓ పెంగ్విన్ మోసం చేసింది. దాదాపు 100 ఏళ్లకు పైగా అది శాస్త్రవేత్తల కళ్ల ముందే ఉంది. దాని నమూనాలను కూడా భద్రపరిచారు. కానీ అది ప్రత్యేకమైన జాతి అని మాత్రం ఎవరూ గుర్తించలేదు. చివరకు ఆ రహస్యాన్ని బయటపెట్టింది దాని రూపం కాదు.. దాని డీఎన్ఏ!
శాస్త్రవేత్తలు 100 ఏళ్ల తర్వాత తొలిసారిగా కొత్త పెంగ్విన్ జాతిని గుర్తించారు. దానికి పైగోసెలిస్ కెర్గులెన్సిస్ (Pygoscelis kerguelensis) అనే శాస్త్రీయ నామం పెట్టారు. దీనిని సౌత్ ఈస్టర్న్ జెంటూ పెంగ్విన్ అని పిలుస్తున్నారు. ఇవి అంటార్కిటికాకు 1,200 మైళ్ల దూరంలో హిందూ మహాసముద్రంలోని కెర్గులెన్ దీవుల్ని తమ నివాసంగా చేసుకున్నాయి. భూమిపై అత్యంత ఏకాంత ప్రాంతాల్లో ఈ దీవులు ఒకటి. ఇంతకాలం ఈ ప్రాంతాల్లో కనిపించే జెంటూ పెంగ్విన్‌లను ఒకే జాతికి చెందినవిగా శాస్త్రవేత్తలు భావించారు. కానీ కొత్త జన్యు పరిశోధన ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది.
అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం జెంటూ పెంగ్విన్‌లపై విస్తృతంగా జన్యు పరిశోధన చేసింది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ శాస్త్రవేత్తల నేతృత్వంలో, చిలీకి చెందిన పరిశోధకులతో ఈ అధ్యయనం చేపట్టారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని 10 పెంగ్విన్ కాలనీల నుంచి 64 పెంగ్విన్‌ల పూర్తి జన్యు సమాచారాన్ని పరిశీలించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. ఇప్పటివరకు ఒకే జాతిగా భావించిన జెంటూ పెంగ్విన్‌లు వాస్తవానికి నాలుగు ప్రత్యేక జాతులు అని తేలింది. అవి ఉత్తర జెంటూ – Pygoscelis papua, దక్షిణ జెంటూ – Pygoscelis ellsworth, తూర్పు జెంటూ – Pygoscelis taeniat, ఆగ్నేయ జెంటూ – Pygoscelis kerguelensis -కొత్తగా గుర్తించిన జాతి. అంటే శాస్త్రవేత్తలు నాలుగు కొత్త పెంగ్విన్‌లను ఒక్కసారిగా కనుగొనలేదు. ఇన్నాళ్లూ ఒకే జాతిగా భావించిన పెంగ్విన్‌లు వాస్తవానికి నాలుగు వేర్వేరు జాతులని గుర్తించారు.
కొత్తగా గుర్తించిన కెర్గులెన్ పెంగ్విన్‌ను శాస్త్రవేత్తలు క్రిప్టిక్ స్పీసీస్‌గా పేర్కొంటున్నారు. అంటే.. బయటకు చూస్తే మరో దగ్గరి జాతిలాగే కనిపిస్తుంది. కానీ జన్యుపరంగా మాత్రం ప్రత్యేకమైన జాతి. ఈ పెంగ్విన్‌లో ఇతర జెంటూ పెంగ్విన్‌లతో పోలిస్తే శరీర పరిమాణం, అరుపులు లేదా శబ్దాల్లో స్వల్ప తేడాలు మాత్రమే కనిపించాయి. కానీ DNAలో మాత్రం స్పష్టమైన తేడాలు బయటపడ్డాయి. ఈ నాలుగు జాతులు సుమారు 3 లక్షల నుంచి 5 లక్షల సంవత్సరాల క్రితమే ఒకదానికొకటి వేరుపడినట్లు పరిశోధకులు అంచనా వేశారు. భౌగోళికంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉండటం, అక్కడి పర్యావరణ పరిస్థితులు కూడా ఈ పరిణామానికి కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఈ కథలో అసలు ఆశ్చర్యం ఇక్కడే ఉంది. కొత్తగా గుర్తించిన Pygoscelis kerguelensis జాతి శాస్త్రవేత్తలకు ఇప్పుడు కొత్తగా కనిపించినది కాదు. 1897లోనే కెర్గులెన్ దీవిలో ఈ పెంగ్విన్‌కు చెందిన ఓ నమూనాను శాస్త్రవేత్తలు సేకరించారు. అంతేకాదు.. ఆ దీవులకు చెందిన మరికొన్ని పెంగ్విన్ నమూనాలు 19వ శతాబ్దానికి చెందినవే. అంటే 100 ఏళ్లకు పైగా క్రితమే శాస్త్రవేత్తలు ఈ పెంగ్విన్‌ను చూశారు. దాని నమూనాలను సేకరించి భద్రపరిచారు. కానీ అది ప్రత్యేకమైన జాతి అనే విషయం మాత్రం అప్పట్లో తెలియలేదు. ఇప్పుడు DNA టెక్నాలజీ ఆ వందేళ్ల నాటి రహస్యాన్ని బయటపెట్టింది.
జెంటూ పెంగ్విన్‌లు సాధారణంగా చేపలు, క్రిల్, స్క్విడ్, కటిల్ ఫిష్ వంటి సముద్ర జీవులను ఆహారంగా తీసుకుంటాయి. అవి తమ సంతానోత్పత్తి ప్రాంతాలకు దగ్గరగా ఉండటంతో పాటు, తరతరాలుగా అదే ప్రాంతాల్లోని గూళ్లకు తిరిగి వస్తుంటాయి. దీంతో వేర్వేరు ప్రాంతాల్లోని పెంగ్విన్ జనాభా ఒకదానికొకటి దూరంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. చాలా తరాల తర్వాత వాటిలో ప్రత్యేకమైన జన్యు మార్పులు ఏర్పడి కొత్త జాతులుగా పరిణమించే అవకాశం ఉంటుంది. దక్షిణ మహాసముద్రంలోని అంటార్కిటిక్ పోలార్ ఫ్రంట్ అనే నీటి ప్రాంతాల మధ్య సరిహద్దు కూడా కొన్ని పెంగ్విన్ జనాభాలను వేరు చేయడంలో పాత్ర పోషించి ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ పరిశోధన మరో ముఖ్యమైన విషయాన్ని కూడా చెబుతోంది. ఈ నాలుగు జెంటూ పెంగ్విన్ జాతులు భిన్నమైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మారినట్లు వాటి జన్యువుల్లో ఆధారాలు కనిపించాయి. వాటి శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, ఆక్సిజన్ రవాణా, జీవక్రియ వంటి లక్షణాలకు సంబంధించిన జన్యు తేడాలు గుర్తించారు. అయితే వాతావరణ మార్పులు ఈ జాతుల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే మారుతున్న సముద్ర పర్యావరణ పరిస్థితులు పెంగ్విన్‌లకు సవాలుగా మారుతున్నాయి.