
మహిళలు నిత్యం ధరించే వెండి పట్టీలు, ఆభరణాలు కొద్ది రోజులు వాడగానే నల్లబడి కాంతిహీనంగా మారిపోతాయి. దాంతో చాలామంది వాటిని పక్కన పెట్టేస్తుంటారు లేదా క్లీన్ చేయించడానికి షాపుల చుట్టూ తిరుగుతుంటారు. అయితే వెండి నల్లబడటం అనేది ఒక సహజ రసాయన ప్రక్రియ. గాలిలోని సల్ఫర్, హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువులతో వెండి చర్య జరిపినప్పుడు దానిపై సిల్వర్ సల్ఫైడ్ అనే నల్లటి పొర ఏర్పడుతుంది. దీనినే టార్నిషింగ్ అంటారు. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా వంటింట్లో దొరికే వస్తువులతోనే నల్లటి వెండి ఆభరణాలను సరికొత్తగా మెరిపించవచ్చు.
వెండిపై ఉన్న మొండి నలుపును వదిలించడానికి అల్యూమినియం ఫాయిల్ బెస్ట్ ఆప్షన్. ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకుని, అడుగున అల్యూమినియం ఫాయిల్ పేపర్‌ను ఉంచాలి. అందులో 2 టీస్పూన్ల బేకింగ్ సోడా, కొద్దిగా వంట ఉప్పు వేసి కలపాలి. నల్లబడిన వెండి వస్తువులను ఆ నీటిలో సుమారు 10 నిమిషాల పాటు నానబెట్టాలి. రసాయన చర్య వల్ల వెండిపై ఉన్న సిల్వర్ సల్ఫైడ్ అల్యూమినియం వైపు ఆకర్షితమై నలుపు తొలగిపోతుంది. అనంతరం సాధారణ నీటితో కడిగి మెత్తటి వస్త్రంతో తుడిస్తే కొత్తవాటిలా తళతళలాడతాయి.
పట్టీల సందుల్లో పేరుకుపోయిన మురికిని వదిలించడానికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో కొద్దిగా గోరువెచ్చని నీళ్లు, ఒక టీస్పూన్ బేకింగ్ సోడా వేసి చిక్కటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను పాత టూత్‌బ్రష్ లేదా మెత్తటి గుడ్డ సాయంతో ఆభరణాలపై పూయాలి. కొన్ని నిమిషాల పాటు మెల్లగా రుద్ది కడిగేస్తే, నలుపు వదిలిపోయి వెండి పూర్వపు మెరుపును సంతరించుకుంటుంది.
సాధారణ దుమ్ము, జిడ్డు వల్ల వెండి మసకబారినప్పుడు ఈ చిట్కా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో వెండి ఆభరణాలను కాసేపు నానబెట్టాలి. తేలికపాటి లిక్విడ్ సోప్ లేదా మైల్డ్ డిటర్జెంట్‌ను బ్రష్‌పై వేసి సున్నితంగా రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసి, కాటన్ గుడ్డతో పూర్తిగా ఆరబెట్టాలి.
చిన్నపాటి వెండి వస్తువులు, ఉంగరాలు లేదా గొలుసులపై సాధారణ వైట్ టూత్‌పేస్ట్‌ను పూసి 5 నిమిషాల తర్వాత బ్రష్‌తో రుద్ది కడిగినా వెండి తక్షణమే మెరుస్తుంది. ఇలా ఇంట్లోనే లభించే బేకింగ్ సోడా, అల్యూమినియం ఫాయిల్ వంటి చిన్న వస్తువులతో నిమిషాల వ్యవధిలో వెండి ఆభరణాల మెరుపును తిరిగి పొందవచ్చు.