Viral Video: గోడ పక్కన చెత్త వేస్తూ దొరికిపోయాడు.. లౌడ్‌స్పీకర్‌లో హెచ్చరికతో షాక్!

గ్రేటర్ నోయిడాలో రోడ్డుపక్కన చెత్త వేస్తున్న ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. గోడ పక్కన చెత్త పడేసి వెళ్లిపోవాలని చూసిన అతడిని సీసీటీవీ కెమెరాలు పట్టేశాయి. అంతే.. వెంటనే లౌడ్‌స్పీకర్‌లో అతడిని ప్రశ్నిస్తూ చెత్తను తిరిగి తీసుకెళ్లాలని హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న ఆ వ్యక్తి చివరకు చెత్తను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: గోడ పక్కన చెత్త వేస్తూ దొరికిపోయాడు.. లౌడ్‌స్పీకర్‌లో హెచ్చరికతో షాక్!
Greater Noida Man Dumps Garbage On Road Gets A Public Warning On Loudspeaker

Updated on: Oct 11, 2026 | 9:00 PM

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా, సెక్టార్ బీటా-1 ప్రాంతంలో అక్టోబర్ 9వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి చిన్నారిని ఎత్తుకుని అక్కడికి వచ్చాడు. అనంతరం గోడ పక్కన చెత్తను పడేసేందుకు ప్రయత్నించాడు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజీని పర్యవేక్షిస్తున్న వ్యక్తి వెంటనే అప్రమత్తమయ్యాడు. పబ్లిక్ అనౌన్స్‌మెంట్ వ్యవస్థ ద్వారా చెత్త వేస్తున్న వ్యక్తిని ప్రశ్నించాడు.

లౌడ్‌స్పీకర్‌లో హెచ్చరిక.. కంగుతిన్న వ్యక్తి!

గోడ పక్కన చెత్త వేస్తున్న వ్యక్తిని లౌడ్‌స్పీకర్ ద్వారా ప్రశ్నించడంతో అతడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఎక్కడి నుంచి గొంతు వినిపిస్తోందో అర్థంకాక చుట్టూ చూశాడు. మరోసారి హెచ్చరిక వినిపించడంతో అసలు విషయం అతడికి అర్థమైంది. వెంటనే చెత్తను అక్కడి నుంచి తొలగించాలని, లేకపోతే మరుసటి రోజు ఉదయం జరిమానా విధిస్తామని హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేక అతడు అక్కడ పడేసిన చెత్తను తిరిగి తీసుకున్నాడు.

చెత్త వేస్తే సీసీటీవీతో నిఘా!

సెక్టార్ బీటా-1లో పరిశుభ్రతను కాపాడేందుకు స్థానిక రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (RWA) చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ కొందరు ఇతరుల దృష్టికి రాకుండా గోడల పక్కన, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్నారని అసోసియేషన్ ఆరోపించింది. ఇలాంటి వారిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటుంది. తాజాగా జరిగిన ఘటనలో చెత్త వేస్తున్న వ్యక్తిని అక్కడికక్కడే హెచ్చరించేందుకు పబ్లిక్ అనౌన్స్‌మెంట్ వ్యవస్థను ఉపయోగించారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడంపై చర్చ మొదలైంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, నిబంధనలు ఉల్లంఘించే వారిని బాధ్యులను చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us