
తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా సుందరంపల్లి గ్రామంలో ఓ రైతు పొలంలో మట్టి కుండలో పురాతన బంగారు నాణేలు బయటపడ్డాయి. ఈ విషయం స్థానికంగా పెద్ద చర్చకు దారి తీసింది. స్థానికంగా నివాసముండే 55 ఏళ్ల అదవన్ అనే రైతు.. తనకున్న నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని చదును చేస్తున్నాడు. పొలంలో పెద్ద పెద్ద రాళ్లు ఉండటంతో.. వాటిని జేసీబీ సాయంతో డిసెంబర్ 22న తీయడంతో పాటు తవ్వకాలు మొదలుపెట్టాడు. అదే సమయంలో జేసీబీకి మట్టిలో ఏదో తగిలినట్టు అనిపించింది. మట్టిలో పాతిపెట్టిన దాన్ని తవ్వి తీసి చూడగా.. లోపల మెరిసే బంగారు నాణేలు కనిపించాయి.
పురాతన కాలానికి చెందిన ఈ నాణేలు.. ఆకారంలో సరికొత్తగా ఉండగా.. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అతడు వారం తర్వాత డిసెంబర్ 27న గ్రామ పరిపాలన అధికారులు, గండిలి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న వెంటనే, రెవెన్యూ శాఖ, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆపై ఆ బంగారు నాణేలను తహసీల్దార్‌కు అప్పగించారు. మొత్తంగా 86 బంగారు నాణేలు ఉన్నట్టు నిర్ధారించారు. కాగా, ఆ మట్టి కుండ మూత పగిలిపోయి ఉండటం, నాణేల గురించి ఆలస్యంగా సమాచారం ఇవ్వడంతో పోలీసులు.. సదరు రైతుపై ప్రశ్నల వర్షం కురిపించారు. అటు ఆ నాణేలు ఏ కాలానికి చెందినవి.? అలాగే వాటి ప్రాచీన చరిత్రకు సంబంధించిన రహస్యాలను తెలుసుకునే పనిలో పడ్డారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి