అరెరె నిజమా.. పాము వెంటపడినప్పుడు ఇలా పరుగెడితే కాటు వేయదా.. అసలు వాస్తవం ఏంటీ?

పాము ఎదురైతే చాలు.. ఎవరికైనా గుండె ఆగినంత పనవుతుంది. ఇక అది మనల్ని తరుముతుందంటే భయంతో కాళ్లు చేతులు ఆడవు. అయితే అలాంటి అత్యవసర సమయంలో పరుగెత్తడానికి ఒక సీక్రెట్ ట్రిక్ ఉందంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం విపరీతంగా చక్కర్లు కొడుతుంది. నిజంగానే S ఆకారంలో పరుగెడితే పాము కాటు నుంచి తప్పించుకోవచ్చా అనేది తెలుసుకుందాం..

అరెరె నిజమా.. పాము వెంటపడినప్పుడు ఇలా పరుగెడితే కాటు వేయదా.. అసలు వాస్తవం ఏంటీ?
Does Running In An S Shape Save You From A Snake

Updated on: Aug 09, 2026 | 5:42 PM

పాము కనిపిస్తే చాలు.. ఎంతటి వారికైనా ఒళ్లు గగుర్పాటుకు గురవ్వడం సహజం. అలాంటి సమయంలో పాము మనల్ని తరుముతుంటే S ఆకారంలో పరుగెడితే ప్రాణాలు దక్కించుకోవచ్చని, పాము మనల్ని పట్టుకోలేదని సోషల్ మీడియాలో ఒక వింత ప్రచారం విపరీతంగా సాగుతుంది. పాములు పాకే తీరు ఆధారంగా పుట్టుకొచ్చిన ఈ S షేప్ కాన్సెప్ట్‌ను చాలామంది నిజమని నమ్మి షేర్ చేస్తున్నారు. అయితే ఈ విచిత్రమైన చిట్కాలో అస్సలు నిజం లేదని, ఇది పూర్తిగా శాస్త్రీయ ఆధారం లేని ఒక అపోహ మాత్రమేనని స్నేక్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తెలుసుకోవాల్సిన విషయమేమిటంటే.. పాములు సాధారణంగా మనుషులను వేటాడటానికి లేదా కాటు వేయడానికి వెంబడించవు. మనుషుల పరిమాణం ముందు తమ ఉనికి చాలా చిన్నదని పాములకు తెలుసు. అందువల్ల మనుషులు ఎదురైనప్పుడు అవి భయపడి పారిపోవడానికే ప్రాధాన్యత ఇస్తాయి. కానీ తమను చంపడానికి వస్తున్నారని లేదా తమకు ముప్పు పొంచి ఉందని భావించినప్పుడు మాత్రమే అవి ఆత్మరక్షణ కోసం ఎదురుదాడికి దిగుతాయి.

S ఆకారంలో పరుగెత్తడం ప్రమాదకరమా?

పామును తప్పించుకోవడానికి కుడి, ఎడమలకు వంపులు తిరుగుతూ S ఆకారంలో పరుగెత్తాలనే వాదనకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పైగా ఇలా కంగారుగా, వింతగా పరుగెత్తడం వల్ల కాలు జారి కిందపడిపోయే ప్రమాదం పెరుగుతుంది. పడిపోయిన సమయంలో పాముకు మరింత దగ్గరై కాటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువవుతాయి. అందువల్ల నిర్దిష్ట ఆకారాల్లో పరుగెత్తడం కంటే పాముకు ఎంత వీలైతే అంత త్వరగా సురక్షితమైన దూరం పాటించడమే ఏకైక పరిష్కారం.

పాము కనిపిస్తే ఏం చేయాలి?

మీ ఇంట్లో తోటలో లేదా ఆరుబయట ఎక్కడైనా పాము కనిపిస్తే ఈ జాగ్రత్తలు పాటించండి..

భయపడి కేకలు వేయవద్దు: ప్రశాంతంగా ఉండి, పాము ఉన్న ప్రదేశం నుండి నెమ్మదిగా వెనక్కి వెళ్లండి.

తరిమే ప్రయత్నం చేయవద్దు: కర్రలతో కొట్టడం, పట్టుకోవడానికి ప్రయత్నించడం లేదా దాన్ని ఆవరించడం వంటివి అస్సలు చేయకండి.

దారి ఇవ్వండి: పాము తనంతట తాను సురక్షిత ప్రాంతానికి వెళ్లేలా దానికి మార్గం ఇవ్వడం ద్వారా అనవసర ప్రమాదాలను నివారించవచ్చు.

పాము కాటు వేస్తే ఏం చేయాలి?

ఒకవేళ అనుకోకుండా పాము కాటు వేస్తే సెకను సమయం కూడా వృథా చేయకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి యాంటీ స్నేక్ వెనమ్ చికిత్స తీసుకోవాలి. గాయాన్ని కోయడం, రక్తాన్ని పీల్చడం, పసర్లు పూయడం లేదా నాటు వైద్యం వంటి సాంప్రదాయ పద్ధతులను ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. పాముకాటుకు సకాలంలో పొందే అర్హత కలిగిన వైద్య సహాయమే ప్రాణాలను కాపాడుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us