
పాతకాలపు గుప్తనిధులు, కోటల అంతఃపురాల్లో దాచిన ధనరాశులపై పాములు, ముఖ్యంగా నాగుపాములు కాపలా కాస్తాయనే నమ్మకం శతాబ్దాలుగా ప్రచారంలో ఉంది. మన పురాణాలు, జానపద కథలు, సినిమాల్లో కూడా దీనిని విస్తృతంగా చూపించారు. అయితే, సైన్స్, వన్యప్రాణి నిపుణుల ప్రకారం ఇదంతా నిజమేనా..? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..
భారతీయ సంస్కృతిలో నాగుపాములకు ప్రత్యేక స్థానం ఉంది. పురాణాల ప్రకారం, పాతాళ లోకంలో ఉండే నాగ లోకం సంపదకు, మణులకూ నిలయమని నమ్ముతారు. కాలక్రమేణా, భూమిపై దాచబడిన ధనరాశులపై కూడా పాములు కాపలా ఉంటాయనే నమ్మకం బలపడింది. ముఖ్యంగా పూర్వ కాలంలో రాజులు, భూస్వాములు తమ సంపదను దొంగల బారి నుంచి రక్షించుకోవడానికి, ప్రజల్లో భయాన్ని కలిగించడానికి నిధులు ఉన్న చోట పాములు ఉన్నాయనే పుకార్లను వ్యాప్తి చేసేవారని చరిత్రకారులు చెబుతుంటారు.
జీవశాస్త్రం ప్రకారం, పాములు అత్యంత సాధారణమైన సరీసృపాలు. వాటికి మానవుల లాంటి ఆలోచనా శక్తి గానీ, లోభత్వం గానీ ఉండవు. వాటి దృష్టిలో బంగారం, వెండి, డైమండ్స్ అనేవి కేవలం కొన్ని మెరిసే రాళ్లు మాత్రమే. వాటి విలువ పాములకు అస్సలు తెలియదు. పాములు వాటి ఆహారమైన ఎలుకలు, కప్పల వేట కోసం, శత్రువుల నుంచి రక్షణ కోసం సురక్షితమైన స్థావరాన్ని వెతుక్కుంటాయి. గుప్తనిధులు సాధారణంగా ఎవరూ తిరగని పాడుబడిన కోటలు, చీకటి నేలమాళిగలు లేదా గుహల్లో ఉంటాయి. ఇలాంటి నిశ్శబ్ద, చీకటి ప్రదేశాలు పాములకు నివాసయోగ్యంగా మారతాయి. అందువల్లనే అక్కడ నిధులు వెతకడానికి వెళ్లిన వారికి పాములు ఎదురవుతుంటాయి తప్ప, అవి నిధిని కాపాడటానికి అక్కడ కూర్చోవు.
అంతేకాకుండా, పాముల సగటు జీవితకాలం గరిష్టంగా 20 నుండి 30 ఏళ్లు మాత్రమే. కానీ, గుప్తనిధులు వందల సంవత్సరాల నాటివి అయి ఉంటాయి. కాబట్టి, ఒకే పాము తరతరాలుగా నిధిని రక్షించడం అసాధ్యం. కాబట్టి, గుప్తనిధులపై పాములు కాపలా కాస్తాయనేది కేవలం ఒక కల్పిత అపోహ మాత్రమేనని, దీని వెనుక ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని వన్యప్రాణి నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రకృతిలో ప్రతి జీవిలాగే పాము కూడా తన మనుగడ కోసం మాత్రమే జీవిస్తుందని గ్రహించడం అవసరం.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..