
ముంబైలోని బోరివలి ప్రాంతంలో ఓ హోటల్‌లో దోశలో చనిపోయిన ఎలుక కనిపించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనతో హోటల్ లైసెన్స్‌ను ఆహార, ఔషధ పరిపాలనా విభాగం (FDA) సస్పెండ్ చేయగా.. ఆ తర్వాత హోటల్ యజమానికి బెదిరింపు కాల్స్ రావడం మరో మలుపు తిరిగింది. కేసును మూసివేసేందుకు రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. చివరకు పోలీసులు ఉచ్చు వేసి ఓ మహిళను పట్టుకున్నారు.
సెప్టెంబర్ 24న మాన్సీ ఆచార్య అనే మహిళ మరో ఇద్దరు పురుషులు, ఓ చిన్నారితో కలిసి బోరివలిలోని రాధాకృష్ణ హోటల్‌కు వెళ్లారు. అక్కడ వారు పలు ఆహార పదార్థాలను ఆర్డర్ చేశారు. అయితే టేబుల్‌కు వచ్చిన మైసూర్ మసాలా దోశలో చనిపోయిన చిన్న ఎలుక కనిపించిందని మాన్సీ ఆచార్య ఆరోపించారు. ఆమె సోదరుడు అప్పటికే దోశలో కొన్ని ముక్కలు తిన్న తర్వాత అందులో ఎలుకను గుర్తించినట్లు ఆమె తెలిపారు. దాన్ని చూసి తీవ్రంగా షాక్‌కు గురై వెంటనే వాంతులు చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై మాన్సీ బోరివలి పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
దోశలో ఎలుక ఉన్నట్లు ఆరోపణలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సెప్టెంబర్ 28న ఆహార, ఔషధ పరిపాలనా విభాగం హోటల్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసింది. ఈ పరిణామంతో హోటల్ మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని యజమాని పేర్కొన్నట్లు సమాచారం. లైసెన్స్ సస్పెన్షన్ తర్వాత హోటల్ యజమానికి వరుసగా ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమైంది. ఘటనకు సంబంధించిన వీడియోను మరింతగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా హోటల్ యజమాని బంధువులకు కూడా ఫోన్ చేసి ఘటన గురించి ప్రచారం చేసినట్లు ఆరోపించారు. మొదట రూ.25 లక్షలు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బెదిరింపులు కొనసాగడంతో చివరకు రూ.6 లక్షలకు సెటిల్‌మెంట్ జరిగినట్లు సమాచారం. అప్పటికే హోటల్ యజమాని రూ.1 లక్ష నగదును ఫోన్ చేసిన వ్యక్తికి ఇచ్చినట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 29న హోటల్ యజమాని బోరివలి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు నిందితులను పట్టుకునేందుకు పథకం వేశారు. మరో రూ.6 లక్షలు తీసుకునేందుకు మహిళను పిలిచారు. ఆమె డబ్బు తీసుకునేందుకు వచ్చిన సమయంలో పోలీసులు వలపన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. పోలీసుల ప్రకారం.. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా గుర్తించిన మహిళ మాన్సీ అమిత్ ఆచార్య (36). ఆమె బోరివలిలోని గోరై ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు తెలిపారు. మాన్సీ ఆచార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసులో చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో మరికొందరు వ్యక్తుల పాత్ర ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు దోశలో చనిపోయిన ఎలుక కనిపించిందన్న ఆరోపణతో ప్రారంభమైన ఘటన.. మరోవైపు వీడియోను అడ్డుపెట్టుకుని డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలతో కొత్త మలుపు తిరిగింది. ప్రస్తుతం బోరివలి పోలీసులు రెండు అంశాలకు సంబంధించిన వివరాలను దర్యాప్తు చేస్తున్నారు.