ఆకాశంలో బాహుబలి.. ఆగకుండా సముద్రాన్ని దాటే గుండె ధైర్యం.. ఈ పక్షితో మామూలుగా ఉండదు..

జీపీఎస్ లేదు.. గూగుల్ మ్యాప్స్ లేవు.. కానీ వేల కిలోమీటర్ల సుదూర ప్రయాణంలో దారి అస్సలు తప్పదు.. 150 గ్రాముల ప్రాణం.. ఏకంగా 29,000 కిలోమీటర్ల అంతర్జాతీయ ప్రయాణం.. ఆఫ్రికా నుంచి బయలుదేరి అరేబియా సముద్రం మీదుగా భారత్‌కు వస్తున్న అముర్ ఫాల్కన్ డేగల గురించి తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు..

ఆకాశంలో బాహుబలి.. ఆగకుండా సముద్రాన్ని దాటే గుండె ధైర్యం.. ఈ పక్షితో మామూలుగా ఉండదు..
The Incredible Journey Of Amur Falcon Along

Updated on: May 19, 2026 | 10:33 PM

ఒక చిన్న పావురమంత పరిమాణం.. కేవలం ఒక సబ్బు బిళ్లంత బరువు.. కానీ గుండె నిండా అపరిమితమైన ధైర్యం. ఏ మాత్రం విశ్రాంతి లేకుండా, కంటిమీద కునుకు లేకుండా విశాలమైన అరేబియా సముద్రాన్ని ఒంటరిగా దాటుతోంది ఒక పక్షి. వేల కిలోమీటర్ల నీటి సామ్రాజ్యాన్ని కేవలం మూడు రోజుల్లోనే దాటేయాలనే పట్టుదలతో ఆ చిన్నారి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆ పక్షి పేరే అలాంగ్. నవంబర్ 2025లో మణిపూర్‌లో శాస్త్రవేత్తలు దీనికి శాటిలైట్ ట్యాగ్ అమర్చారు. మే 15న సోమాలియా నుండి బయలుదేరిన అలాంగ్, ప్రస్తుతం అరేబియా సముద్రం మీదుగా భారతదేశ పశ్చిమ తీరం వైపు జైత్రయాత్ర సాగిస్తోంది. వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు రేయింబవళ్లు దీని ప్రతి కదలికను నిజసమయంలో పర్యవేక్షిస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యంత అసాధారణ వలస పక్షి

అముర్ ఫాల్కన్ అనేది ప్రపంచంలోనే అత్యంత సుదూర ప్రాంతాలకు వలస వెళ్లే అద్భుతమైన పక్షి జాతి. దీని సాధారణ బరువు కేవలం 150 గ్రాములు మాత్రమే. ప్రతి సంవత్సరం ఈ పక్షులు సైబీరియా, మంగోలియా, ఉత్తర చైనాలోని తమ సంతానోత్పత్తి ప్రదేశాల నుండి దక్షిణ ఆఫ్రికాలోని శీతాకాల నివాసాల మధ్య ఏకంగా 29,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. అంటే సంవత్సరానికి రెండుసార్లు భూమి చుట్టుకొలతలో దాదాపు ముప్పావు వంతు దూరాన్ని ఇవి చుట్టి వస్తాయి.

అరేబియా సముద్రాన్ని ఆగకుండా ఎలా దాటుతాయి?

సముద్రంపై వాలడానికి వీల్లేదు.. అలసిపోతే ఆశ్రయం ఇచ్చే చెట్టు లేదు. మరి ఈ డేగలు అరేబియా సముద్రాన్ని నిరంతరాయంగా ఎలా దాటగలుగుతున్నాయి? దీని వెనుక ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుత రహస్యం ఉంది. అదే హైపర్‌ఫేజియా.

కొవ్వునే ఇంధనంగా మార్చుకుని: సముద్ర ప్రయాణానికి ముందు ఈ పక్షులన్నీ మణిపూర్‌లోని టమెంగ్‌లాంగ్ ప్రాంతంలో ఆగుతాయి. అక్కడ లక్షలాది పక్షులు గుంపులుగా చేరి, చెదపురుగులను కడుపునిండా తింటాయి. ఈ అతిగా తినడం వల్ల వాటి శరీర బరువు 150 గ్రాముల నుండి ఏకంగా 280 గ్రాములకు (దాదాపు రెట్టింపు) పెరుగుతుంది.

నిరంతర రెక్కల శ్రమ: సముద్రంపై థర్మల్స్ ఉండవు. అందువల్ల ఇవి రోజుల తరబడి నిరంతరం రెక్కలు ఆడిస్తూనే ఉండాలి. ఈ శ్రమలో వాటి శరీరంలోని కొవ్వు కరిగి ఇంధనంగా మారుతుంది. అలాగే ఆ కొవ్వు నుండే శరీరానికి కావలసిన నీరు కూడా ఉత్పత్తి అవుతుంది.

గతంలో అలాంగ్‌తో పాటు ప్రయాణించిన అపపాంగ్ అనే మగ డేగ, సోమాలియా నుండి మధ్య భారతదేశానికి ఉన్న 4,750 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 95 గంటల్లో దాటి రికార్డు సృష్టించింది.

అసలు దారి ఎలా తెలుస్తుంది?

జీపీఎస్ లాంటి సాంకేతికత లేకపోయినా ఈ పక్షులకు దారి అస్సలు తప్పదు. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం, సూర్యుడు, నక్షత్రాల స్థానాలను బట్టి ఇవి దిశను నిర్దేశించుకుంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఇవి సోమాలి జెట్ అనే శక్తివంతమైన కాలానుగుణ పవనాలను వాడుకుంటాయి. 1,000 నుండి 3,000 మీటర్ల ఎత్తులో వీచే ఈ అనుకూల గాలుల వల్ల వీటి శ్రమ, శక్తి వ్యయం చాలా వరకు తగ్గుతుంది.

వేట క్షేత్రం నుండి పరిరక్షణ వైపు.. భారతదేశ విజయం

ఒకప్పుడు మణిపూర్‌లోని టమెంగ్‌లాంగ్ ప్రాంతంలో ఈ పక్షులను విచ్చలవిడిగా వేటాడేవారు. కానీ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిధులతో, మణిపూర్ అటవీ శాఖ, వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా చేపట్టిన దశాబ్ద కాలపు ప్రాజెక్ట్ అక్కడ అద్భుత మార్పు తెచ్చింది. స్థానిక ప్రజల్లో అవగాహన పెంచడంతో ఒకప్పుడు వేటాడిన చేతులే ఇప్పుడు ఆ పక్షులకు రక్షకులుగా మారాయి. ఇది గ్లోబల్ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్‌లో ఒక గొప్ప విజయగాథ. ప్రస్తుతం మన అలాంగ్ ఇంకా ఆకాశంలో ఎగురుతూనే ఉంది. త్వరలోనే అది భారతదేశ పశ్చిమ తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయి, ఆపై సంతానోత్పత్తి కోసం ఈశాన్య దిశగా తన ప్రయాణాన్ని కొనసాగించనుంది. అలాంగ్ సాగించే ఈ సుదీర్ఘ పోరాటం, ప్రకృతి సృష్టించిన ఒక మహా అద్భుతం.

Follow Us