Viral: నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే.. వెనకేసింది కోటి రూపాయలు..

జాంగ్ ఇంత పెద్ద మొత్తాన్ని సంపాదించడం వెనుక ఒకే ఒక్క సూత్రం ఉంది. అదే నిరంతర శ్రమ. ఉదయం 10:40 గంటలకు మొదలుపెట్టి.. అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట వరకు ఆర్డర్లు డెలివరీ చేసేవాడు. సెలవులు తీసుకోకుండా పని చేయడమే కాకుండా, సమయాన్ని ఆదా చేసేందుకు డెలివరీ సమయంలో ఎప్పుడూ పరిగెడుతూనే ఉండేవాడు.

Viral: నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే.. వెనకేసింది కోటి రూపాయలు..
Delivery Boy
Image Credit source: Pinterest

Updated on: Dec 25, 2025 | 1:59 PM

చైనాకు చెందిన 25 ఏళ్ల జాంగ్ నేటి తరం యువతకు ఒక గొప్ప నిదర్శనంగా నిలుస్తున్నాడు. 5 ఏళ్ళుగా ఫుడ్ డెలివరీ రైడర్‌గా పనిచేస్తూ లక్షా 60వేల డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.కోటి 42 లక్షలు సేవింగ్స్ చేసి షాకిచ్చాడు. ఖరీదైన షాంఘై నగరంలో ఉంటూ కూడా.. కేవలం తన శ్రమను నమ్ముకుని ఈ అసాధారణ మైలురాయిని సృష్టించాడు. జాంగ్ ప్రయాణం ఈజీగా సాగలేదు. 2020లో బ్రేక్‌ఫాస్ట్ సెంటర్‌ ప్రారంభించి నష్టపోవడంతో సుమారు 6 లక్షల రూపాయల అప్పులపాలయ్యాడు. ఆ అప్పులు తీర్చి, తన కాళ్ల మీద తాను నిలబడాలనే పట్టుదలతో షాంఘై నగరానికి వలస వచ్చాడు. అక్కడ ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా చేరిన జాంగ్, అప్పులు తీర్చడమే కాకుండా తన భవిష్యత్తు కోసం కోటి రూపాయలకు పైగా వెనకేయడం అతని ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతోంది.

జాంగ్ ఇంత పెద్ద మొత్తాన్ని సంపాదించడం వెనుక ఒకే ఒక్క సూత్రం ఉంది. అదే నిరంతర శ్రమ. ఉదయం 10:40 గంటలకు మొదలుపెట్టి.. అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట వరకు ఆర్డర్లు డెలివరీ చేసేవాడు. సెలవులు తీసుకోకుండా పని చేయడమే కాకుండా, సమయాన్ని ఆదా చేసేందుకు డెలివరీ సమయంలో ఎప్పుడూ పరిగెడుతూనే ఉండేవాడు. అందుకే తన తోటి రైడర్లు అతన్ని గౌరవంగా ‘ఆర్డర్ కింగ్’ అని పిలుస్తారు. సంపాదించిన దానిని కాపాడటంలోనూ జాంగ్ నేటి తరానికి ఆదర్శంగా నిలిచాడు. అనవసరమైన లగ్జరీ ఖర్చులకు, వ్యసనాలకు దూరంగా ఉంటూ అత్యంత సాదాసీదా జీవితాన్ని గడిపాడు. ఐదేళ్లలో అతను తన ఎలక్ట్రిక్ బైక్ మీద సుమారు 3.24 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి లక్షలాది ఆర్డర్లను సమయానికి డెలివరీ చేశాడు. కష్టపడే తత్వం ఉంటే ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చని నిరూపించాడు జాంగ్. ప్రస్తుతం తన దగ్గర ఉన్న సేవింగ్స్ తో షాంఘై నగరంలోనే రెండు కొత్త రెస్టారెంట్లను ప్రారంభించాలని జాంగ్ ప్లాన్ చేస్తున్నాడు. గతంలో ఓడిపోయిన చోటే మళ్లీ గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఒక సాధారణ డెలివరీ బాయ్‌గా మొదలై.. కోటీశ్వరుడిగా మారి ఇప్పుడు వ్యాపారవేత్తగా ఎదగబోతున్న జాంగ్ ప్రయాణం నేటి తరానికి ఒక సక్సెస్ స్టోరీ లాంటిదని చెప్పొచ్చు.