
దేశంలో మానవులు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా అడవులకు సమీపంలో నివసించే గ్రామాల ప్రజలు ఏనుగుల దాడులతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్లో ‘కబ్రా కాన్’ అనే అడవి ఏనుగు వరుస దాడులతో కలకలం సృష్టిస్తోంది. గత ఆరు నుంచి ఏడు నెలల్లో ఈ ఏనుగు దాడుల్లో ఏకంగా 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఈ ఏనుగును పట్టుకునేందుకు అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు.
ఛత్తీస్గఢ్ ఉత్తర ప్రాంతంలోని కోరియా సర్గుజా, సూరజ్పూర్, బల్రాంపూర్ జిల్లాల అటవీ ప్రాంతాల్లో ఈ ఏనుగు సంచరిస్తోంది. సుమారు 20 ఏళ్ల వయసున్న ఈ మగ ఏనుగు దాదాపు 3 వేల కిలోల బరువు ఉంటుంది. చెవిపై ఉండే ప్రత్యేకమైన మచ్చల కారణంగా స్థానికులు దీనిని కబ్రా కాన్ అని పిలుస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ ఏనుగు దాడుల్లో 16 మంది మరణించగా, మరికొందరు గాయపడ్డారు. రాత్రిపూట సుమారు 35 నుంచి 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం ఉండటంతో దీని కదలికలను గుర్తించడం అధికారులకు కష్టంగా మారింది.
ఈ ఏనుగును మత్తుమందు ఇచ్చి పట్టుకునేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి నవంబర్ 12న అనుమతులు లభించాయి. దీంతో 100 మందికి పైగా అటవీ సిబ్బంది, ముగ్గురు పశువైద్యులు రంగంలోకి దిగారు. వీరితో పాటు కర్ణాటక నుంచి తీసుకొచ్చిన రెండు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను కూడా ఆపరేషన్లో భాగం చేశారు. డ్రోన్ల సాయంతో కబ్రా కాన్ కదలికలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. గ్రామస్థులను అప్రమత్తం చేసేందుకు హాథీ మిత్ర దళం కూడా పనిచేస్తోంది.
అధికారులకు ప్రస్తుతం ఎదురవుతున్న అతిపెద్ద సమస్య ఏమిటంటే.. కబ్రా కాన్ ఇతర మగ ఏనుగుల గుంపులో కలిసిపోయింది. దీంతో దానిని ప్రత్యేకంగా గుర్తించి మత్తుమందు ఇవ్వడం కష్టంగా మారింది. గుంపులోని ఇతర ఏనుగులు కూడా దీనిని పూర్తిగా అంగీకరించడం లేదని అధికారులు భావిస్తున్నారు. ఇది గుంపు నుంచి విడిపోయే వరకు వేచి చూస్తున్నారు.
ఏనుగుకు మత్తుమందు ఇచ్చిన తర్వాత అది పాక్షిక స్పృహలోకి వెళ్తుంది. అప్పుడు దానిని సురక్షితంగా తరలించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం భూమిలో భారీ గుంత తవ్వి, ఎనిమిది చక్రాల లారీ వెనుక భాగాన్ని అందులోకి దించారు. కుంకీ ఏనుగుల సాయంతో కబ్రా కాన్ను ర్యాంప్ ద్వారా లారీలోకి ఎక్కించాలని ప్రణాళిక రూపొందించారు.
మరోవైపు, ఛత్తీస్గఢ్లో గత ఐదేళ్లలో ఏనుగుల దాడుల్లో 340 మందికి పైగా మరణించినట్లు రాష్ట్ర శాసనసభకు సమర్పించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మనుషులు, ఏనుగుల మధ్య పెరుగుతున్న సంఘర్షణలు అక్కడి ప్రజలకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..