మార్టిన్ లూథర్ కింగ్ ‘ఐ హావ్ ఏ డ్రీమ్’ ప్రసంగం చేతిరాత ప్రతులు వేలానికి.. ధర తెలిస్తే షాకే!
అమెరికా పౌర హక్కుల ఉద్యమ నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ స్వయంగా రాసిన ఏడు పేజీల ఈ అరుదైన పత్రాలు ఇప్పుడు వేలానికి సిద్ధమయ్యాయి. దశాబ్దాల పాటు ఓ డ్రాయర్లో ఉండిపోయిన ఈ చారిత్రక సంపదకు ఏకంగా 10 మిలియన్ డాలర్లకు పైగా ధర పలకవచ్చని అంచనా వేస్తున్నారు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.90 కోట్లకు పైమాటే! ఇంతకీ ఈ పత్రాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇన్నాళ్లూ అవి ఎలా బయటపడకుండా ఉండిపోయాయి?

ఓ పాత డెస్క్.. అందులో ఓ డ్రాయర్.. ఆ డ్రాయర్లో దశాబ్దాలుగా ఎవరి కంటా పడకుండా ఉన్న ఓ కవర్! అందులో ఏముందో చూసినప్పుడు మాత్రం అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అది మామూలు కాగితాలు కాదు.. ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన ప్రసంగాల్లో ఒకటైన ‘ఐ హావ్ ఏ డ్రీమ్’ (I Have a Dream)కు సంబంధించిన అసలు చేతిరాత ప్రతులు! అమెరికా పౌర హక్కుల ఉద్యమ నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ స్వయంగా రాసిన ఏడు పేజీల ఈ అరుదైన పత్రాలు ఇప్పుడు వేలానికి సిద్ధమయ్యాయి. దశాబ్దాల పాటు ఓ డ్రాయర్లో ఉండిపోయిన ఈ చారిత్రక సంపదకు ఏకంగా 10 మిలియన్ డాలర్లకు పైగా ధర పలకవచ్చని అంచనా వేస్తున్నారు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.90 కోట్లకు పైమాటే! ఇంతకీ ఈ పత్రాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇన్నాళ్లూ అవి ఎలా బయటపడకుండా ఉండిపోయాయి?
చేతిరాత ఉన్న ఏడు పేజీల్లో చరిత్ర!
1963 ఆగస్టు 28 అమెరికా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. వాషింగ్టన్‌లోని లింకన్ మెమోరియల్ వద్ద లక్షలాది మంది ప్రజలు ఒక్కచోట చేరారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా, సమాన హక్కుల కోసం గళమెత్తిన ఆ సభలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చేసిన ప్రసంగం ప్రపంచాన్నే కదిలించింది. అదే ‘ఐ హావ్ ఏ డ్రీమ్’.
అయితే ఆ చారిత్రక ప్రసంగం వెనుక ఎంతో కష్టం ఉంది. సభకు ముందు రోజు రాత్రి వాషింగ్టన్‌లోని విల్లార్డ్ హోటల్లో ఉన్న కింగ్.. తెల్లవారుజామున 4 గంటల వరకు నిద్రపోకుండా ప్రసంగాన్ని సిద్ధం చేశారు. కేవలం ఐదు నిమిషాల్లో తన సందేశాన్ని ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా రాశారు. అలా నీలిరంగు సిరాతో ఏడు పసుపు రంగు పేజీలపై తన ఆలోచనలకు అక్షరరూపం ఇచ్చారు. ఆ తర్వాత సహాయకులు వాటిని టైప్ చేసి మీడియా ప్రతినిధులకు అందించారు. మధ్యాహ్నం సుమారు 2.5 లక్షల మంది ప్రజల ముందు కింగ్ ప్రసంగించారు. ఆయన పలికిన మాటలు అప్పట్లోనే కాదు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయి.
అసలు ప్రసంగంలో లేని ‘ఐ హావ్ ఏ డ్రీమ్’
ఈ ఏడు పేజీల ప్రతుల్లో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మారుమోగిన ‘ఐ హావ్ ఏ డ్రీమ్’ అనే పదాలే అందులో లేవు! అదేంటి.. ఆ ప్రసంగానికి ఆ పేరెలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారా? నిజానికి కింగ్ ముందుగా సిద్ధం చేసుకున్న ప్రసంగంలో ఆ పదాలు లేవు. వేదికపై మాట్లాడుతున్న సమయంలో తన సహజమైన శైలిలో, అప్పటికప్పుడు ఆ పదాలను చేర్చి ప్రసంగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. అంటే ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిన ఆ నాలుగు పదాలు ముందుగా రాసుకున్న కాగితాల్లో కాకుండా.. ప్రసంగం చేస్తున్న సమయంలో ఆయన మనసులో నుంచి వచ్చినవన్నమాట!
అయితే ఈ చేతిరాత ప్రతుల్లో ప్రసంగానికి సంబంధించిన మరో అద్భుతమైన ముగింపు ఉంది. ‘ఫ్రీ ఎట్ లాస్ట్, ఫ్రీ ఎట్ లాస్ట్; థ్యాంక్ గాడ్ ఆల్మైటీ, వి ఆర్ ఫ్రీ ఎట్ లాస్ట్’ అంటూ స్వేచ్ఛను చాటిచెప్పే శక్తివంతమైన వాక్యాలు అందులో ఉన్నాయి. ఈ మాటలు ఇప్పటికీ పౌర హక్కుల ఉద్యమానికి ప్రతీకగా నిలిచాయి.
రూ.90 కోట్లకు పైగా ధర.. ఎక్కడ వేలం వేయనున్నారంటే?
దశాబ్దాల పాటు ఓ డ్రాయర్లో ఉన్న ఈ ఏడు పేజీల పత్రాలు ఇప్పుడు అంతర్జాతీయ వేలం ప్రపంచంలో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ప్రముఖ వేలం సంస్థ క్రిస్టీస్ వీటిని 2027 జనవరి 22న న్యూయార్క్‌లో వేలం వేయనుంది. ఒకే లాట్‌గా ఈ పత్రాలను విక్రయించనున్నారు. వీటి ధర 10 మిలియన్ డాలర్లకు పైగా పలకవచ్చని అంచనా. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.90 కోట్లకు పైగా!
వేలానికి ముందు జనవరి 15 నుంచి 21 వరకు న్యూయార్క్‌లోని 20 రాక్ఫెల్లర్ ప్లాజాలో ప్రజల సందర్శనార్థం ఈ పత్రాలను ప్రదర్శించనున్నారు. అంతకంటే ముందుగా నవంబర్ 16 నుంచి 22 వరకు అట్లాంటాలోని నేషనల్ సెంటర్ ఫర్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్‌లోనూ ప్రదర్శిస్తారు. ఆ తర్వాత చికాగోలో కూడా వీటిని ప్రదర్శించి న్యూయార్క్‌కు తీసుకెళ్లనున్నారు.
భార్యకు కనిపించినా.. విలువ తెలియక మళ్లీ డ్రాయర్లోనే!
ఇంతటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న పత్రాలు ఇన్నాళ్లూ ఎక్కడున్నాయో తెలుసా? కింగ్‌కు సన్నిహిత సహాయకుడిగా పనిచేసిన ఎడ్వర్డ్ టీ క్లేటన్ దగ్గర! ఆయన సదరన్ క్రిస్టియన్ లీడర్షిప్ కాన్ఫరెన్స్‌లో పబ్లిక్ రిలేషన్స్ విభాగానికి అధిపతిగా పనిచేశారు. కింగ్‌తో కలిసి ఆయన ప్రసంగాల రూపకల్పనలోనూ పాలుపంచుకున్నారు.
ఎడ్వర్డ్ క్లేటన్ మరణానంతరం ఆయనకు సంబంధించిన పాత పత్రాలు, వస్తువులు ఇంట్లోనే ఉండిపోయాయి. 1990ల చివర్లో ఆయన భార్య జెర్నోనా క్లేటన్‌కు ఓ డెస్క్ డ్రాయర్లో అనుకోకుండా ఒక కవర్ కనిపించింది. దానిపై ‘స్పీచ్’ అని రాసి ఉంది. అందులో ఏడు పేజీల చేతిరాత ప్రతులు ఉన్నాయి. అయితే అవి ఎంతటి విలువైనవో అప్పట్లో ఆమెకు తెలియలేదు. దీంతో ఆ కవర్‌ను తిరిగి డ్రాయర్లోనే పెట్టేశారు.
అలా మరోసారి ఆ పత్రాలు దశాబ్దాల పాటు కనుమరుగయ్యాయి. చివరకు 2024లో జెర్నోనా మరోసారి వాటిని పరిశీలించారు. అప్పుడు వాటి అసలు ప్రాధాన్యత ఆమెకు అర్థమైంది. మార్టిన్ లూథర్ కింగ్ స్వయంగా రాసిన ఏకైక తుది చేతిరాత ప్రతులు అవేనని గుర్తించారు. ఆమె సలహాదారు ఎడ్డీ బ్రిడ్జ్మన్, క్రిస్టీస్ వేలం సంస్థ నిపుణులు కూడా వాటి చారిత్రక విలువను గుర్తించారు.
వేలం డబ్బు ఎవరికి వెళ్తుంది?
ఈ పత్రాలను వేలం వేయడం ద్వారా వచ్చే డబ్బు కేవలం ఒకరి చేతికి వెళ్లిపోదు. పలు స్వచ్ఛంద సంస్థలకు ఈ మొత్తాన్ని అందించనున్నారు. ముఖ్యంగా జెర్నోనా క్లేటన్ ఫౌండేషన్‌తో పాటు ది కింగ్ సెంటర్‌కు కూడా ఈ నిధులు అందనున్నాయి.
ఈ పత్రాలు ప్రపంచం ముందుకు రావడంపై జెర్నోనా క్లేటన్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తన భర్త ఎడ్వర్డ్, మార్టిన్ లూథర్ కింగ్ మధ్య ప్రసంగాల విషయంలో ఎంతో మంచి అనుబంధం ఉండేదని గుర్తుచేసుకున్నారు. ఇద్దరూ పదాలను మార్చుకుంటూ, వాక్యాలను మెరుగుపరుస్తూ పనిచేసేవారని తెలిపారు. ఇప్పుడు ఆ అద్భుతమైన మాటలను ప్రపంచమంతా చూసే అవకాశం రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
క్రిస్టీస్ మాన్యుస్క్రిప్ట్ నిపుణుడు పీటర్ క్లార్నెట్ సైతం ఈ పత్రాలను చూసి ఆశ్చర్యపోయారు. వాటిని చదువుతుంటే కింగ్ తన ప్రసంగాన్ని ఎలా రాశారు, ఎక్కడ మార్పులు చేశారు అనేది కళ్లముందు కనిపిస్తుందని చెప్పారు. ఇది అమెరికా చరిత్రలో అత్యంత విలువైన సంపదల్లో ఒకటని అభిప్రాయపడ్డారు.
మార్టిన్ లూథర్ కింగ్ కుమారుడు మార్టిన్ లూథర్ కింగ్ III కూడా ఈ పత్రాలు భద్రంగా ఉండటంపై క్లేటన్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి చారిత్రక ప్రసంగం వెనుక ఉన్న ఆలోచనలు, సిద్ధమైన విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కుమార్తె బెర్నిస్ ఏ. కింగ్ కూడా వేలం ద్వారా వచ్చే ఆదాయం ది కింగ్ సెంటర్ కార్యకలాపాలకు ఉపయోగపడనుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఒకప్పుడు ఓ డ్రాయర్లో సాధారణ కాగితాల్లా కనిపించిన ఏడు పేజీలు ఇప్పుడు ప్రపంచ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయి. ఒక గొప్ప నాయకుడి ఆలోచనలు, ఆయన కలలు, సమానత్వం కోసం చేసిన పోరాటం అన్నీ ఆ చేతిరాతలోనే కనిపించి ఆశ్చర్యపరుస్తున్నాయి.