అడవిలో దాగిన భారీ పాములు.. డ్రోన్లతో వేటకు దిగిన శాస్త్రవేత్తలు!

అది మామూలు పాము కాదు.. ఏకంగా 16 అడుగుల పొడవు.. 67 కిలోల బరువుంటుంది! అమెరికా ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లేడ్స్‌ ప్రాంతంలో ఈ భారీ బర్మీస్ కొండచిలువలు ఇప్పుడు శాస్త్రవేత్తలకు తలనొప్పిగా మారాయి. దట్టమైన అడవులు, చిత్తడి నేలలు, నీటితో నిండిన ప్రాంతాల్లో పాముల కోసం వెతకడం కష్టం కావడంతో తాజాగా డ్రోన్లను రంగంలోకి దించారు.

అడవిలో దాగిన భారీ పాములు.. డ్రోన్లతో వేటకు దిగిన శాస్త్రవేత్తలు!
Burmese Python Released After Radio Tagging In Florida

Updated on: Oct 10, 2026 | 4:56 PM

అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) శాస్త్రవేత్తలు ఫ్లోరిడాలోని గ్రేటర్ ఎవర్‌గ్లేడ్స్ ప్రాంతంలో 16 అడుగుల పొడవున్న ఓ ఆడ కొండచిలువకు రేడియో ట్యాగ్ పరికరాన్ని అమర్చారు. అనంతరం పామును తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టారు. ఆసక్తికర విషయం ఏమిటంటే.. శాస్త్రవేత్తలు పాముల కోసం మైళ్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్లే కన్నా రేడియో ట్యాగ్ నుంచి వచ్చే సంకేతాలను డ్రోన్ల సాయంతో గుర్తించే అవకాశాలను పరీక్షిస్తున్నారు.

డ్రోన్లతో పాములను ఎలా గుర్తిస్తారు?

ఈ పరిశోధనలో ఉపయోగిస్తున్న డ్రోన్లకు రేడియో ట్రాకింగ్ పరికరాలు, కెమెరాలను ఏర్పాటు చేస్తారు. వాటి సాయంతో పాముల కదలికలను గుర్తించడం, వాటి నివాస ప్రాంతాలను అధ్యయనం చేయడం చేస్తారు. సాధారణంగా పాములను గుర్తించాలంటే పరిశోధకులు అడవుల్లో, చిత్తడి నేలల్లో గంటల తరబడి వెతుకుతారు. కొన్ని ప్రాంతాల్లో కాలినడకన వెళ్లడం ప్రమాదకరమైనా తప్పదు. దట్టమైన వృక్షాలు, బురద, నీటి మార్గాల కారణంగా పరిశోధనకు ఎక్కువ సమయం, ఖర్చు అవుతాయి.
డ్రోన్లతో ఈ సమస్యలను కొంతవరకు అధిగమించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Burmese Python In Florida

బర్మీస్ కొండచిలువలతో ఎందుకు ప్రమాదం?

ఫ్లోరిడాలోని గ్రేటర్ ఎవర్‌గ్లేడ్స్ ప్రాంతం విస్తారమైన చిత్తడి నేలలు, అడవులకు ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో సహజంగా ఉండే జాతి కాకపోయినా, అక్కడ స్థిరపడిపోయి పర్యావరణంపై పెను ప్రభావం చూపుతున్నాయి బర్మీస్‌ కొండచిలువలు. చిన్న క్షీరదాల దగ్గర్నుంచి పెద్ద సైజు జంతువులను వేటాడి చంపి తినేస్తున్నాయి. దాంతో ఎవర్‌గ్లేడ్స్‌ లో వన్యప్రాణుల మనుగడకు ముప్పు ఏర్పడుతోంది. ఈ ప్రాంతంలో క్షీరదాల సంఖ్య గణనీయంగా తగ్గడానికి బర్మీస్ కొండచిలువలు కారణం.

సాధారణంగా నదుల మార్గాల్లో మార్పులను మ్యాపింగ్ చేయడం, అడవుల్లో చెట్ల తొలగింపు తర్వాత ఏర్పడే మార్పులను పరిశీలించడం కోసం డ్రోన్లను ఉపయోగిస్తారు. ఇప్పుడు అదే సాంకేతిక నైపుణ్యాన్ని ఫ్లోరిడాలోని కొండచిలువలను ట్రాక్ చేసేందుకు వాడుతున్నారు. డ్రోన్స్‌ ప్రయోగం విజయవంతమైతే, దట్టమైన అడవులు, చిత్తడి నేలల్లో పాములను గుర్తించడం మరింత సులువుగా మారుతుంది. అయితే, ఈ సాంకేతికత ఎంత వరకు పనిచేస్తుందో తెలుసుకోవడం కోసం పరిశోధనా ఫలితాల కోసం ఉత్కంఠగా వేచి చూస్తున్నారు శాస్త్రవేత్తలు.

Loading...
Unable to load recommendations.
Follow Us