Plastic Surgery : ఈరోజుల్లో చాలామంది అందంగా లేమనుకుంటూ తమలో తాము ఆత్మన్యూనతా భావానికి గురవుతున్నారు. ముఖం బాగోలేదని, ముక్కు సరిగా లేదని అభద్రతా భావానికి గురువుతున్నారు. అందుకే అందం కోసం మార్కెట్లో దొరికే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. మరికొందరు ప్లాస్టిక్ సర్జరీలంటూ లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇక ఎంతో అనుభవం, పనితనం ఉన్న నిపుణులే ఈ ప్లాస్టిక్ సర్జరీలే నిర్వహిస్తారు. అయితే ఏ కష్టమొచ్చిందో తెలియదు కానీ బ్రెజిల్ దేశానికి చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్(YouTube) చూసి తానే స్వయంగా ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ( Plastic Surgery) చేసుకున్నాడు. చివరకు ఆస్పత్రి పాలయ్యాడు.
తలంటు పోసిన డాక్టర్లు..
ఈ రోజుల్లో చాలామంది యూట్యూబ్ ట్యుటోరియల్స్ చూసి వంటలు, క్రాఫ్ట్ సహా అనేక విషయాలు నేర్చుకుంటున్నారు. అయితే వీటికి ఒక పరిమితి ఉంటుంది. ఈక్రమంలో బ్రెజిల్‌లోని సావోపాలోకు చెందిన ఒక వ్యక్తి యూట్యూబ్ వీడియోలను చూసి తన ముక్కుకు శస్త్రచికిత్స చేసుకున్నాడు. యూట్యూబ్ ట్యుటోరియల్ చూసిన తర్వాత ముక్కును సరిచేసుకోవడానికి రైనోప్లాస్టీ ఆపరేషన్ చేసుకున్నాడు. అయితే ఈ సర్జరీ తర్వాత పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో చేసేదేమి లేక ఆస్పత్రికి వెళ్లాడు. జరిగిన విషయాన్ని డాక్టర్లకు చెప్పాడు. గాయాన్ని పరిశీలించిన వైద్యులు అతనికి బాగా తలంటుపోశారు. ఆ తర్వాత బాధితుడి గాయాన్ని శుభ్రం చేసి సరైన చికిత్స చేశారు. మరోసారి అలా ఎవరూ చేయవద్దని సూచించారు. ఇలాంటి విషయాల్లో సలహాలు, సూచనలు పాటించడం తప్పనిసరి అని తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..