
జనవరి 26న గణతంత్ర దినోత్సవం రాబోతుంది. భారత రాజ్యాంగం అమల్లోకి అమల్లోకి వచ్చిన సందర్భంగా ప్రతీ ఏడాది జనవరి 26న రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశవ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ ప్రదేశాల్లో త్రివర్ణ పతాకాలు ఎగరేసి పండగలా జరుపుకుంటాం. మరికొద్ది రోజుల్లోనే గణతంత్ర దినోత్సవం వస్తుండటంతో ఇప్పటినుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అయితే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో గ్రాండ్‌గా పరేడ్ ప్రతీ ఏడాది జరుగుతూ ఉంటుంది. అలాగే సరిహద్దుల్లో ఆర్మీ బీటింగ్ రిట్రీట్ కూడా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలను దేశ ప్రజలు కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇందుకోసం ముందుగా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

పరేడ్ టికెట్ల ధర రూ.100, రూ.20గా ఉన్నాయి. ఇక బీటింగ్ రిట్రీట్ ఫుల్ డ్రెస్ రిహార్సల్ టికెట్ల ధర రూ.20గా ఉండగా.. ప్రధాన బీటింగ్ రిట్రీట్ టికెట్ ధర రూ.100గా ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆమంత్రన్ పోర్టల్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

అలాగే ఆఫ్‌లైన్‌లో కూడా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ టికెట్ల కోసం ఢిల్లీలో ఏర్పాటు చేసే ప్రత్యేక కౌంటర్లను సంప్రదించాల్సి ఉంటుంది. ఇందుకోసం 6 ప్రదేశాల్లో బూత్‌లను ఏర్పాటు చేశారు. టికెట్ బుకింగ్ కోసం ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ లాంటి ఒరిజినల్ ఐడీ కార్డులను చూపించాల్సి ఉంటుంది.

జనవరి 5వ తేదీ నుంచి ఆన్ లైన్, ఆఫ్ లైన్ టికెట్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆసక్తిగలవారు ఆన్ లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇక ఆఫ్ లైన్ టికెట్ కౌంటర్లు జనవరి 5 నుంచి 14 వరకు అందుబాటులో ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటాయి.