
ఆయనను చూసి తోటి వారే నవ్వుకున్నారు. అవేమీ పట్టించుకోని ఆయన డబ్బు సంపాదించడం కోసం రోజులో 5 నిమిషాలు ఆలోచించేవారు. అలా ఓ రోజు ఒక కొత్త పరికరం కనిపెట్టాలన్న ఆలోచన ఆయనకు తట్టింది.
తాను యువకుడిగా ఉన్నప్పుడే కేవలం ఐదు నిమిషాల ఆలోచనతో జీవితంలో ఏదైనా సాధించాలనే సవాలును ఆయన తనకి తానుగా విసురుకున్నారు. కొంతమంది పరిశోధకులు, యూనివర్సిటీ ప్రొఫెసర్ల సహకారంతో ఒక సరికొత్త ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌లేటర్ (అనువాద పరికరం)ను విజయవంతంగా కనిపెట్టారు. ఆయన ఎవరో కాదు, ప్రముఖ సాఫ్ట్‌బ్యాంక్ వ్యవస్థాపకుడు మసయోషి సన్. 2026 సెప్టెంబరు నాటికి ఆయన ఆస్తుల విలువ అక్షరాల రూ 5.3 లక్షల కోట్లు.
ఆ పరికరాన్ని జపాన్‌కు చెందిన ఓ ప్రముఖ సంస్థకు 1.7 మిలియన్ డాలర్లకు అమ్మారు. ఈ విధంగా మసయోషి సన్ వ్యాపార ప్రయాణానికి తొలి అడుగు పడింది. ఆ తరువాత ఆయన జపాన్ నుంచి వీడియో గేమ్ యంత్రాలను అమెరికాకు దిగుమతి చేసి అక్కడి రెస్టారెంట్లకు విక్రయించేవారు. అలా కేవలం 5 నిమిషాల ఆలోచనతో మొదలైన ఆ ప్రయత్నం ద్వారా, కేవలం 18 నెలల వ్యవధిలోనే ఆయన మొత్తం 3.2 మిలియన్ డాలర్లను ఆర్జించి తన వ్యాపార నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు.
అమెరికా వెళ్లిన సన్.. కంప్యూటర్లు, టెక్నాలజీ రంగంపై అవగాహన సంపాదించారు. అక్కడ తన చదువును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, సాఫ్ట్‌వేర్ పంపిణీ వ్యవస్థగా ‘సాఫ్ట్‌బ్యాంక్’ సంస్థను స్థాపించారు. అయితే ఆయన అంచెలంచెలుగా కోట్లకు అధిపతి కావడానికి మాత్రం విభిన్న రంగాల్లో పెట్టిన పెట్టుబడులే ప్రధాన కారణం. ఇంటర్నెట్ సరిగ్గా ప్రారంభమవుతున్న తొలి దశలోనే ఆయన భవిష్యత్తును అంచనా వేసి టెక్ కంపెనీలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వాటిలో తెలివిగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు.
ఇందులో భాగంగానే, 2000వ సంవత్సరంలో అప్పట్లో కేవలం ఒక చిన్న సంస్థగా ఉన్న ‘అలీబాబా’ (Alibaba) కంపెనీలో మసయోషి సన్ 20 మిలియన్ డాలర్లను భారీ పెట్టుబడిగా పెట్టారు. ఆ తర్వాత కాలంలో ఆ సంస్థ ఊహించని విధంగా ఎదిగి కోట్లలో లాభాలను ఆర్జించింది. అలీబాబా విజయం సన్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది, ప్రపంచ కుబేరులలో ఒకరిగా నిలబెట్టింది.
టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న ఈ క్రమంలోనే, 2025లో సాఫ్ట్‌బ్యాంక్, ఓపెన్‌ఏఐ, ఒరాకిల్, ఎంజీఎక్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ‘స్టార్‌గేట్’ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించాయి. అమెరికాలో ఏఐ రంగానికి సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధి కోసం రానున్న నాలుగేళ్లలో దాదాపు 500 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఈ బృహత్తర ప్రాజెక్టుకు మసయోషి సన్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తున్నారు.