
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఎటా జిల్లా, నిధౌలీ కలాన్ గ్రామంలో పురాతన నాణేలు బయటపడటంతో గ్రామస్థులు, పోలీసులు, పురావస్తు శాఖ మధ్య ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. సుమారు 15 రోజుల క్రితం స్థానికంగా నివాసం ఉండే యాద్రామ్ అనే రైతు తన భూమిలో సబ్‌మర్సిబుల్ పైప్‌లైన్ ఏర్పాటుకు తవ్వకాలు చేయించాడు. ఆ సమయంలో నాణేలు ఏమీ కనిపించలేదు. అయితే, ఇటీవల కురిసిన వర్షాల తరువాత, ఒక పిల్లవాడికి ఆ ప్రాంతంలో ఏవో మెరుస్తూ కనిపించాయి. ఏంటా అని చూడగా.. అతను ఎప్పుడూ చూడనటువంటి నాణేలు. విషయం గ్రామంలో చెప్పడంతో.. కొందరు పరుగు పరుగున వచ్చి ఆ నాణేలను తీసుకెళ్లి దాచుకున్నారు.
విషయం తెలియడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. గ్రామస్తుల నుంచి ఇప్పటివరకు 17 నాణేలను స్వాధీనం చేసుకున్నారు. వీటిపై పురాతన ఉర్దూ లిపిలో ఏదో రాయబడిందని, ఇవి మొగల్ కాలానికి చెందినవిగా అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఇంకా తవ్వకాలు జరిపితే ఇంకా పురాతన నిధి బయటపడే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న నాణేలను పురావస్తు శాఖకు అప్పగించనున్నారు. నాణేల అసలు ప్రాముఖ్యతను, వీటి చరిత్రను తెలియజేయడానికి పురావస్తు నిపుణుల సహాయం అవసరమని భావిస్తున్నారు. గ్రామంలోని కొన్ని కుటుంబాల వద్ద ఇంకా నాణేలు ఉన్నాయన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. ఈ అంశం ప్రస్తుతం నిధౌలీ కలాన్ ప్రాంతంలో హాట్‌టాపిక్‌గా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..