
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు 2026 మిడ్ టర్మ్ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలాయి. ఎన్నికల్లో డెమొక్రాట్లు ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటినీ కైవసం చేసుకోవడంతో రిపబ్లికన్ పార్టీకి భారీ పరాజయం ఎదురైంది. అయితే ఈ రాజకీయ పరిణామం కంటే సోషల్ మీడియాలో ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు పెద్ద ఎత్తున మీమ్స్, AI రూపొందించిన వీడియోలు, పాత ఫొటోలతో సెటైర్లు పేలుస్తున్నారు.
2026 అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయాన్ని నెటిజన్లు ‘బ్లూ సునామీ’గా అభివర్ణిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే #BlueTsunami అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ‘బ్లూనామీ వచ్చేస్తోంది.. మాగా (MAGA)కు ముగింపు’ అంటూ కొందరు కామెంట్ చేశారు. డెమొక్రాట్ల విజయాన్ని రిపబ్లికన్ల ఓటమిని పోలుస్తూ అనేక మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
ట్రంప్ అనుసరిస్తున్న వలస విధానాలను నెటిజన్లు మీమ్స్‌లో ప్రస్తావిస్తున్నారు. అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించాలన్న ట్రంప్ కఠిన వైఖరిని గుర్తు చేస్తూ.. ‘ట్రంప్ మెజారిటీనే అమెరికా బహిష్కరించడానికి సిద్ధమవుతోందనిపిస్తోంది’ అంటూ ఓ యూజర్ సెటైర్ వేశారు.
భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా ఈ మీమ్‌ల జోరులో భాగమైంది. నలుగురు వ్యక్తులు ట్రంప్‌ను ఎత్తుకుని ‘ప్రమాదకర వ్యర్థాలు’ అని రాసి ఉన్న చెత్త డబ్బాలో పడేస్తున్నట్లుగా ఉన్న ఫొటోను పోస్టు చేసింది. దానికి ‘అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలు’ అనే క్యాప్షన్ జోడించింది. ఈ చిత్రం కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది
ఎన్నికల ఫలితాలపై ట్రంప్ స్పందించారు. ప్రజల తీర్పును అంగీకరిస్తానని, డెమొక్రాట్లతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని రిపబ్లికన్ పార్టీ ఓటమికి తనను బాధ్యుడిగా చూడకూడదని తెలిపారు. ఎన్నికల్లో తాను పోటీ చేయలేదని, ఒకవేళ పోటీ చేసి ఉంటే భారీ మెజారిటీతో గెలిచేవాడినని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల ఫలితాలతో ట్రంప్ పదవీకాలం మిగిలిన సమయంలో అమెరికా రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కాంగ్రెస్‌లోని రెండు సభలపైనా డెమొక్రాట్లకు ఆధిపత్యం లభించడంతో ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలకు గట్టి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో మాత్రం ట్రంప్‌కు ఎదురైన ఈ రాజకీయ ఎదురుదెబ్బపై మీమ్స్, AI వీడియోల సందడి అప్పుడే మొదలైపోయింది. ఒక్కో పోస్టుతో నెటిజన్లు తమదైన శైలిలో అమెరికా ఎన్నికల ఫలితాలపై స్పందిస్తున్నారు.