
సాధారణంగా పాములు అంటేనే మనకు భయం, వణుకు. అవి అడవుల్లోనో, పొలాల్లోనో ఉంటే పర్వాలేదు కానీ, మనం నివసించే ఇంట్లోకి వస్తే ఆ పరిస్థితి ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. అయితే పాములు కావాలని మనుషులపై దాడి చేయడానికి రావు. మన ఇంట్లో నిత్యం ఉండే కొన్ని వాసనలు, మనం చేసే కొన్ని పనులు వాటిని అయస్కాంతంలా ఆకర్షిస్తాయని తాజా పరిశోధనలు, సర్ప నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ ఇల్లు స్నేక్ ప్రూఫ్‌గా ఉండాలంటే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి.
పాములకు చూపు మందగించినా, వాటి నాలుక ద్వారా గాలిలోని వాసనలను పసిగట్టే శక్తి అద్భుతంగా ఉంటుంది. మీ ఇంట్లో ఎలుకలు ఉన్నాయంటే, అక్కడ పాములు ఉండే అవకాశం 90 శాతం ఉంటుంది. ఎలుకల మూత్రం, మలం, వాటి శరీరం నుంచి వచ్చే ఒక రకమైన జిగట వాసనను పాములు కిలోమీటర్ల దూరం నుంచి పసిగట్టగలవు. ఇంటి చూరులో లేదా కిటికీల దగ్గర పిచుకలు, పావురాలు గూళ్లు కట్టుకుంటే ఆ వాసన పాములకు దావత్ లాంటిది. పక్షి రెట్టల వాసన పాములను నేరుగా మీ ఇంటి పైకప్పు మీదికి రప్పిస్తుంది.
పాములు నేరుగా మీరు వండిన అన్నం లేదా కూరలను తినవు. కానీ కుక్కలు లేదా పిల్లుల ఆహారాన్ని బయట పడేయడం వల్ల ఆ వాసనకు ఎలుకలు, ఉడుతలు వస్తాయి. వీటిని వేటాడటానికి పాములు వస్తాయి. వంటగది వ్యర్థాల్లో ఉండే గుడ్డు పెంకుల వాసన కొన్ని రకాల పాములను విపరీతంగా ఆకర్షిస్తుంది.
ఇది చాలా మందిని భయపెట్టే నిజం. పాములు తమ తోటి జీవులతో కమ్యూనికేట్ చేయడానికి ఫెరోమోన్లు అనే రసాయనాలను విడుదల చేస్తాయి. ఒక పాము మీ ఇంట్లో తిరిగినా లేదా అక్కడ చనిపోయినా.. ఆ వాసన చాలా కాలం పాటు ఉంటుంది. ఇది ఇతర మగ లేదా ఆడ పాములను ఆ ప్రదేశానికి ఆకర్షిస్తుంది. అందుకే పాము వచ్చి వెళ్లిన చోట ఘాటైన ద్రావణాలతో శుభ్రం చేయడం అవసరం.
పాములు కేవలం ఆహారం కోసమే కాదు, దప్పిక తీర్చుకోవడానికి మరియు శరీరాన్ని చల్లబరుచుకోవడానికి కూడా వస్తాయి. ఏసీ నుంచి కారే నీరు, తోటలో నిల్వ ఉన్న నీటి కుంటలు, లేదా కూలర్ల దగ్గర ఉండే తేమ పాములకు ఇష్టమైన ఆవాసాలు. ముఖ్యంగా వేసవి, వర్షాకాలంలో ఈ తేమ వాసన పాములను ఆకర్షిస్తుంది.
వెల్లుల్లి – నిమ్మకాయ మంత్రం: పాములకు ఘాటైన వాసనలంటే అస్సలు పడదు. వెల్లుల్లి రెబ్బలను దంచి నీటిలో కలిపి ఇంటి చుట్టూ చల్లడం లేదా నిమ్మగడ్డి నూనెను వాడటం వల్ల పాములు దరిచేరవు.
దాల్చినచెక్క – లవంగాలు: వీటి మిశ్రమం నుంచి వచ్చే వాసన పాముల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అందుకే వీటిని ఇంటి ద్వారాల దగ్గర ఉంచడం మంచిది.
పరిసరాల శుభ్రత: ఇంటి చుట్టూ దట్టమైన పొదలు, పాత సామాన్లు, ఇటుకల కుప్పలు లేకుండా చూసుకోండి. ఇవి పాములకు సురక్షితమైన దాగుడుమూతల ప్రదేశాలు.
పగుళ్ల తనిఖీ: డ్రైనేజీ పైపులు, కిటికీల సందులు, తలుపుల కింద ఉండే ఖాళీలను మెష్ లతో మూసివేయండి.