
సమాజంలో మార్పు తేవడానికి ఒక్కరి సంకల్పం చాలనేది నిజమే అయినప్పటికీ, పౌర స్పృహ లోపించడం వల్ల మంచి పనులకు ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయో చెప్పే ఒక ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లాలో ప్రవహించే అజనార్ నదిని ఎనిమిది నెలల పాటు కష్టపడి ఒంటరిగా శుభ్రం చేసిన 21 ఏళ్ల యువకుడు బిట్టు తబాహి (సురేంద్ర సింగ్ చౌదరి) పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. అయితే, కొద్ది రోజుల క్రితం ఆయన పడిన కష్టమంతా కేవలం ఒక్క నెల వ్యవధిలోనే నీళ్లపాలైంది.
అజనార్ నదిని పూర్తిగా ప్రక్షాళన చేసిన బిట్టు తబాహి, సెప్టెంబర్ 1న ఆ పనులను విజయవంతంగా పూర్తి చేశారు. కానీ, కేవలం ఒక నెల తిరిగేసరికి ప్రజలు నదిలో ప్లాస్టిక్ కవర్లు, పూల మాలలు, వ్యర్థాలు పడేయడంతో నది మళ్ళీ మునుపటిలాగే కలుషితమైంది. ఈ పరిస్థితిని చూసి చలించిపోయిన బిట్టు తబాహి ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నా ఎనిమిది నెలల కష్టం ఇలా ముప్పై రోజుల్లో బూడిదవుతుందని కలలో కూడా ఊహించలేదు. దయచేసి నదిలో ప్లాస్టిక్, చెత్తాచెదారం వేయకండి. నదిని పాడు చేయడం చాలా సులభం, కానీ దాన్ని శుభ్రం చేయడానికి ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది అని ఆయన ప్రజలను వేడుకున్నారు.
తన శ్రమ వృథా అయినప్పటికీ, బిట్టు తబాహి నిరాశ చెంది కూర్చోలేదు. నదిని మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురావాలని నిర్ణయించుకున్న ఆయన, ఒంటరిగా మళ్లీ నదిని శుభ్రం చేసే పనులకు శ్రీకారం చుట్టారు. ఈసారి ఉదయాన్నే నది వద్దకు చేరుకున్న ఆయన, ఈత రాకపోయినా ప్రాణాలను లెక్కచేయకుండా నీటిలోకి దిగి చెత్తను తొలగించడం ప్రారంభించారు. గంటల తరబడి శ్రమించి పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వ్యర్థాలను పాలిథిన్ కవర్లలోకి ఏరివేశారు. నదిని పూర్తిగా, శాశ్వతంగా శుభ్రపరిచే వరకు ప్రతిరోజూ కొద్దికొద్దిగా ఈ పనులు కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.
బిట్టు తబాహి పోస్ట్ చేసిన ఈ తాజా వీడియో చూసిన నెటిజన్లు భారతీయుల పౌర స్పృహ లోపంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నదిని మురికి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో, ఏమాత్రం వెనకడుగు వేయకుండా పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న బిట్టు తబాహి అంకితభావాన్ని అందరూ ఆకాశానికెత్తుతూ సెల్యూట్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..