
అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. సాధారణంగా రోజూవారీ కూలీ పనులకు వెళ్లిన ఓ యువకుడికి ఏకంగా కోట్ల రూపాయల విలువైన బంగారు నిధి కళ్లముందు ప్రత్యక్షమైంది. బెల్జియంలో జరిగిన ఈ ఆసక్తికర ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది.
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింట్-గిల్లిస్-డెండర్‌మొండే పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి ఓ పురాతన భవనంలో మురుగునీటి పైపులైన్ల మార్పు, పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. సెలవుల్లో భాగంగా తాత్కాలిక నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న 18 ఏళ్ల కోబే అనే విద్యార్థి తన సహచరులతో కలిసి తవ్వకాలు జరుపుతున్నాడు. ఈ క్రమంలో భవనం నేలమాళిగలోని ఓ గోడ వద్ద ఇటుకలతో మూసివేసిన రహస్య ప్రదేశంలో వారికి ఒక సంచి కనిపించింది.
తొలుత వాటిని సాధారణ ఒక యూరో నాణేలుగా కోబే భావించాడు. అయితే మరికొంత లోతుగా తవ్వి పరిశీలించగా, అక్కడ మెరుస్తున్న బంగారు ముక్కలు, అరుదైన బంగారు నాణేలతో పాటు నంబర్లు ముద్రించి ఉన్న సుమారు 50 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. వీటి మొత్తం విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 9 మిలియన్ యూరోలు, అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ. 98 నుండి 99 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఈ నిధి లభించిన భవనానికి గొప్ప చరిత్ర ఉంది. 19వ శతాబ్దం చివర్లో థియోఫిలస్ వాన్ అస్చే అనే సంపన్న బీరు తయారీ వ్యాపారి కోసం దీనిని నిర్మించారు. 1899 నుండి 1970 వరకు ఇక్కడ బీరు తయారీ కార్యకలాపాలు కొనసాగాయి. ప్రస్తుతం సామాజిక సంక్షేమ సంస్థ CAW ఊస్ట్-వ్లాండెర్న్ ఈ భవనాన్ని కార్యాలయాలు, నివాస సదుపాయాల కోసం ఆధునీకరిస్తోంది. ఎవరో కావాలనే ఈ బంగారాన్ని గోడలో ఇటుకలు కట్టి దాచిపెట్టినట్లు స్పష్టమవుతోంది.
ఇంత భారీ సంపద దొరికినప్పటికీ, కోబే,అతని సహచరులు నిజాయితీగా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని బ్రస్సెల్స్‌లోని అత్యంత సురక్షిత ప్రాంతానికి తరలించారు. బెల్జియం చట్టాల ప్రకారం, దొరికిన నిధికి అసలు వారసులు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోవడానికి ఐదేళ్ల పాటు (2031 వరకు) వేచి చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరూ సరైన ఆధారాలు చూపకపోతే, నిబంధనల ప్రకారం ఆ నిధిని కనిపెట్టిన కార్మికుడికి, ప్రస్తుత భవన యజమానులకు పంచే అవకాశం ఉంది. ఏది ఏమైనా, తన నిజాయితీకి తగిన బహుమతి లభిస్తుందని ఆ 18 ఏళ్ల విద్యార్థి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.