YS Sharmila Khammam Public Meeting: ఖమ్మం గడ్డపై సంకల్ప సభ.. కేసీఆర్ టార్గెట్‌గా వాక్భాణాలు సంధించిన వైఎస్ షర్మిల..

|

Apr 09, 2021 | 9:31 PM

YS Sharmila Khammam Public Meeting: మరికాసేపట్లో ఉత్కంఠకు తెరపడబోతోంది. తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది.

YS Sharmila Khammam Public Meeting: ఖమ్మం గడ్డపై సంకల్ప సభ.. కేసీఆర్ టార్గెట్‌గా వాక్భాణాలు సంధించిన వైఎస్ షర్మిల..
Ys Sharmila

YS Sharmila Khammam Public Meeting: మరికాసేపట్లో ఉత్కంఠకు తెరపడబోతోంది. తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. వైఎస్ఆర్ తనయ, ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరి.. వైఎస్‌ షర్మిల సంకల్ప సభ ఖమ్మంలో జరుగుతోంది. ఖమ్మంలోని పేవిలియన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఈ సభా వేదికపై వైఎస్ షర్మిల.. తన పార్టీ పేరు, పార్టీ జెండాను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పేరు ఏం ఉండబోతోంది ? పార్టీ జెండా ఏంటి ? ఎజెండా ఏంటి ? అనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు షర్మిల సభకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. జనసందోహంతో సభా ప్రాంగాణం కోలాహలంగా మారింది. ఇదిలాఉంటే.. సభా వేదికపై తెలంగాణ సంస్కృతికి సంబంధించిన పాటలు పాడుతూ కళాకారులు.. సభకు హాజరైన ప్రజలను ఊర్రూతలూగించారు.

సాయంత్రం 5 గంటలకు సభ ప్రారంభం కాగా.. రాత్రి 9 గంటల వరకు సభ జరగనుంది. మరికాసేపట్లో వైఎస్ షర్మిల సభా ప్రాంగాణానికి చేరుకోనున్నారు. వైఎస్ షర్మిలతో పాటు.. వైఎస్ విజయమ్మ కూడా ఈ సభలో పాల్గొంటారని సమాచారం. వీరితో పాటు.. ప్రముఖ నేతలు కూడా సభా వేదికగానే.. షర్మిల పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

కాగా, కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆరువేలమందితో సభ నిర్వహణకు పోలీసులు పర్మిషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదట గ్రాండ్‌గా ఈ సభ నిర్వహించాలని వైఎస్ షర్మిల భావించారు. అయితే, ఆంక్షల నేపథ్యంలో.. నిబంధనల ప్రకారమే సభ నిర్వహించుకుంటామని ప్రకటించారు షర్మిల అనుచరులు. వందమంది కూర్చునేలా స్టేజీని సిద్ధంచేశారు. వైఎస్‌ షర్మిలతో పాటు సభకు తల్లి విజయమ్మ కూడా హాజరవుతున్నారు. వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయలక్ష్మి.. కేవలం తల్లిగా కూతుర్ని ఆశీర్వదించేందుకే ఖమ్మం సభకు వస్తున్నారని షర్మిల అనుచరులు చెబుతున్నారు. ఇక ఖమ్మంలో జరుగుతున్న సంకల్ప సభకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నుంచి పెద్ద సంఖ్యలో వాహనాల్లో అనచురులు తరలి వచ్చారు. భారీ కాన్వాయ్ కారణంగా.. హైదరాబాద్-ఖమ్మం రహదారి కోలాహలంగా మారింది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Apr 2021 09:30 PM (IST)

    ఖమ్మంలో ముగిసిన సంకల్ప సభ.. కేసీఆర్ టార్గెట్‌గా సాగిన షర్మిల ప్రసంగం..

    ఖమ్మంలో వైఎస్ షర్మిల నిర్వహించిన సంకల్ప సభ ముగిసింది. ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. సభా వేదికగా ప్రసంగించిన షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. షర్మిల ప్రసంగం అంతా కేసీఆర్ టార్గెట్‌గానే సాగింది. కేసీఆర్ హామీలు, పాలనా విధానం, అవినీతి, హత్యలు, ఉద్యోగాలు, నీళ్లు వంటి అంశాలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ కేసీఆర్‌ పాలనా విధానాలను తూర్పారబట్టారు.

  • 09 Apr 2021 09:24 PM (IST)

    సింహం సింగిల్‌గా వస్తుంది.. జులై8న కొత్త పార్టీ.. అదే రోజున పార్టీ జెండా ఆవిష్కరణ: వైఎస్ షర్మిల

    పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. సింహం సింగిల్‌గా వస్తుందన్న షర్మిల.. జులై 8వ తేదీన కొత్త పార్టీని ఆవిష్కరించబోతున్నామని ప్రకటించారు. అదే రోజుల పార్టీ జెండాను కూడా ఆవిష్కరించడం జరుగుతుందన్నారు.


  • 09 Apr 2021 09:20 PM (IST)

    తెలంగాణ సిద్ధించికా.. నిధులు, నియామకాలు కేసీఆర్ కుటుంబానికే దక్కాయి: వైఎస్ షర్మిల

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ కుటుంబానికే నిధులు, నియామకాలు దక్కాయని వైఎస్ షర్మిల దుయ్యబట్టారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టారని అన్నారు. స్వరాష్ట ఫలాలు ప్రగతి భవన్‌ గేటు దాటి సామాన్యులకు ఎక్కడ చేరుతున్నాయి? అని ఆమె ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ వాగ్దానం చేసిన కేసీఆర్.. రుణమాఫీ చేశారా? అని ప్రశ్నించారు. రైతుల పేరుమీద అప్పులు చేసి వారి జేబులు నింపుకున్నారంటూ కేసీఆర్ టార్గెట్‌గా తీవ్ర ఆరోపణలు చేశారు.

  • 09 Apr 2021 09:15 PM (IST)

    తెలంగాణ ఆత్మగౌరవం దొరగారి ఎడమకాలి చెప్పుకింద నలిగిపోతోంది: వైఎస్ షర్మిల

    తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దొరగారి ఎడమకాలి చెప్పుకింద నలిగిపోతోందని వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భౌతికంగా తెలంగాణను సాధించుకున్నా.. ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యలకు కారణం ఎవరు? అని షర్మిల ప్రశ్నించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చారా? అని నిలదీశారు. ప్రజల సమస్యలు వినే ఓపిక ఇప్పటి నేతలను ఉందా? అని ప్రశ్నించారు. తాను వెళ్లని సచివాలయాన్ని సీఎం కూలగొట్టించారని షర్మిల మండిపడ్డారు. ఉద్యోగాలు రావడం లేదని సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు.. ఉద్యోగం లేదు.. యువతకు ఉపాధి లేదు అని విమర్శించారు. పేద ప్రజలకు ఆరోగ్యం కరువైందని, 108ని నిర్లక్ష్యం చేశారన్నారు.

  • 09 Apr 2021 09:10 PM (IST)

    ప్రశ్నించడానికే పార్టీ పెడుతున్నాం.. కొత్త పార్టీపై షర్మిల కామెంట్స్..

    తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని, ఆ అవినీతిని, అరాచకాలను ప్రశ్నించడానికే తాను పార్టీ పెట్టి ప్రజల ముందుకు వస్తున్నానని వైఎస్ షర్మిల అన్నారు.

  • 09 Apr 2021 09:07 PM (IST)

    ఇది కాదా అవినీతి.. కేసీఆర్‌ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన వైఎస్ షర్మిల..

    ప్రతి రైతు రాజు కావాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారని వైఎస్ షర్మిల అన్నారు. 16 లక్షల ఎకరాల భూమి సాగు చేయడమే లక్ష్యంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. రూ. 38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రీడిజైన్ల పేరుతో లక్ష కోట్లకు పైగా వ్యయం పెంచారని, ఇది అవినీతిలో భాగమే అని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. వీటన్నింటిని ప్రశ్నించడానికి, నిలదీయడానికి పార్టీ అవసరం అని షర్మిల పేర్కొన్నారు.

  • 09 Apr 2021 09:00 PM (IST)

    ఉద్యమాల గుమ్మం ఖమ్మం.. సంకల్ప సభలో వైఎస్ షర్మిల..

    ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో షర్మిల చేపట్టిన సంక్పల సభకు ప్రజలు పోటెత్తారు. ఈ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన షర్మిల.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమాల గుమ్మం ఖమ్మం.. అని నినదించారు. 18 ఏళ్ల క్రితం ఇదే రోజు చేవెళ్లలో వైఎస్ఆర్ పాదయాత్ర మొదలైందని షర్మిల గుర్తు చేశారు. అన్ని వర్గాలకు భరోసా ఇస్తూ వైఎస్ఆర్ ముందుకు సాగారని అన్నారు.

  • 09 Apr 2021 08:54 PM (IST)

    గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఇక్కడి ప్రజలకు రుణపడి ఉంటాం.. వైఎస్ విజయమ్మ

    వైఎస్ఆర్‌ను మీ గుండెల్లో పెట్టుకున్నందుకు ధన్యవాదాలు అని వైఎస్ విజయమ్మ ప్రజలను ఉద్దేశించి అన్నారు. ఇక్కడి ప్రజలతో తమకు ఉన్న అనుబంధం చెరిగిపోనిది అని అన్నారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఇక్కడి ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. కుల, మత, ప్రాంతాలు వైఎస్ఆర్ ప్రేమకు అడ్డుకాలేదన్నారు. మనుషుల్లో ఎందుకు తేడాలని వైఎస్ఆర్ తన పాలనను సాగించారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ ప్రతి ఒక్కరి కోసం ఆలోచన చేశారన్నారు.

  • 09 Apr 2021 08:51 PM (IST)

    నా బిడ్డను ఆశీర్వదించండి… ప్రజలను కోరిన వైఎస్ విజయమ్మ..

    ప్రజా సేవకై తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడవాలని నిర్ణయించుకున్న వైఎస్ షర్మిలను ఆశీర్వదించాలని ప్రజలను వైఎస్ విజయమ్మ కోరారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల సమస్యలు తీర్చడమే లక్ష్యంగా షర్మిల ముందుకు కదులుతారని పేర్కొన్నారు.

  • 09 Apr 2021 08:47 PM (IST)

    మీ అభిమానానికి నా కృతజ్ఞతలు.. వైఎస్ విజయమ్మ..

    వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై చెక్కు చెదరని అభిమానం చూపుతున్న ప్రజలందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వైఎస్ విజయమ్మ అన్నారు.

  • 09 Apr 2021 08:34 PM (IST)

    18 ఏళ్ల క్రితం ఇదే రోజున చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలు పెట్టిన వైఎస్ఆర్: విజయమ్మ

    సరిగ్గా 18 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 9వ తేదీన అంటే ఇదే రోజున తెలంగాణలోని చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పేరుతో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టారని వైఎస్ విజయమ్మ గుర్తు చేశారు. మళ్లీ అదే తేదీన షర్మిల తన ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నారని విజయమ్మ పేర్కొన్నారు.

  • 09 Apr 2021 07:53 PM (IST)

    ఖమ్మంలో షర్మిలను హత్తుకుని ఉద్వేగానికి గురైన వైఎస్ విజయమ్మ..

    ఖమ్మంలో జరుగుతున్న సంకల్ప సభలో ఉద్వేగభరిత పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించి సభా ప్రాంగాణానికి చేరుకుంటున్న సందర్భంలో వైఎస్ షర్మిలను విజయమ్మ హత్తుకున్నారు. ఆ సందర్భంగా ఆమె కాస్త ఉద్వేగానికి గురయ్యారు.

  • 09 Apr 2021 07:51 PM (IST)

    ఖమ్మం బహిరంగ సభ.. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన వైఎస్ షర్మిల, విజయమ్మ..

    ఖమ్మంలో జరుగుతున్న సంకల్ప సభ ప్రాంగాణానికి వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ చేరుకున్నారు. ఆ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

  • 09 Apr 2021 07:48 PM (IST)

    సంకల్ప సభా ప్రాంగాణానికి చేరుకున్న వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ…

    ఖమ్మం పట్టణంలోని పెవిలియన్స్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న సంకల్ప సభా ప్రాంగాణానికి వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ చేరుకున్నారు.

Follow us on